హైవే పక్కనే గుట్టలుగా ప్రభుత్వ మందులు
- 2027 వరకు ఎక్స్‌పైరీ ఉన్నా చెత్తలో పారవేత
- తెలంగాణలో ఏ జిల్లాకూ సరఫరా కాని బ్యాచ్లు..?
- మందుల మిస్టరీపై డీఎంహెచ్‌వో విచారణ.. ఉన్నతాధికారులకు నివేదిక
భిక్కనూర్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): ప్రజల ఆరోగ్య సంరక్షణ(Healthcare) కోసం ప్రభుత్వ ఆసుపత్రులు(government hospitals), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(primary health centers) సరఫరా చేసే మందులు(medicines) జాతీయ రహదారి పక్కన గుట్టలుగా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. భిక్కనూర్ మండలం(Bhikkhunur mandal) సిద్ధరామేశ్వర్నగర్ పరిధిలోని వజ్రా ఎన్క్లేవ్ సమీపంలో ఎన్హెచ్-44 పక్కన పెద్ద ఎత్తున మందులను పారేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అక్కడ లభించిన పలు మందులపై 2027 వరకు ఎక్స్పైరీ తేదీ ఉండటం. రోడ్డు పక్కన పడేసిన మందుల్లో కాల్షియం, విటమిన్ డీ3, డైక్లోఫెనాక్ తదితర టాబ్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి ప్యాకెట్లపై ఉన్న వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వ ఆరోగ్యశాఖకు సంబంధించిన మందులుగా తెలుస్తోంది. ప్రజలకు ఉచితంగా అందాల్సిన విలువైన మందులు ఇలా రోడ్డు పక్కన పడివుండటంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఘటనాస్థలానికి డీఎంహెచ్వో.. మందుల స్వాధీనం
సమాచారం అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ వెంకట్, మండల వైద్యాధికారి డాక్టర్ యే. మిమాతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడ లభించిన మందులను స్వాధీనం చేసుకుని భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భద్రపరిచినట్లు సమాచారం. అనంతరం మందుల పరిమాణం, రకాలు, బ్యాచ్ నంబర్లు తదితర వివరాలను సేకరించి జిల్లా కార్యాలయంలోని సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్కు పంపించారు. అయితే ఈ బ్యాచ్కు సంబంధించిన మందులు ఇప్పటివరకు తమ వద్దకు రిసీవ్ కాలేదని అక్కడి అధికారులు తెలిపినట్లు సమాచారం.
తెలంగాణలో ఏ జిల్లాకూ సరఫరా కాలేదా..?
ఈ వ్యవహారంపై మరింత సమాచారం కోసం డీఎంహెచ్వో డాక్టర్ వెంకట్ టీఎస్‌ఎంఐడీసీ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది. ఈ బ్యాచ్కు సంబంధించిన మందులు తమ రికార్డుల్లో లేవని వారు తెలిపినట్లు సమాచారం. సంబంధిత కంపెనీ నుంచి ఈ బ్యాచ్కు చెందిన మందులు మిస్సింగ్ అయినట్లు సమాచారం అందినట్లు అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మండల వైద్యాధికారి డాక్టర్ యే.
మిమాను ‘విజయ క్రాంతి’ ఫోన్ ద్వారా సంప్రదించగా, ఘటనాస్థలంలో లభించిన మందుల బ్యాచ్లు తెలంగాణలోని ఏ జిల్లాకు కూడా సరఫరా కాలేదని సంబంధిత అధికారులు తెలిపినట్లు వెల్లడించారు. దీంతో అసలు ఈ మందులు ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణకు సరఫరా కాని బ్యాచ్లు భిక్కనూర్ ఎన్హెచ్-44 పక్కన ఎలా చేరాయి? వాటిని ఎవరు, ఎందుకు అక్కడ పారేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
లెక్కల్లో ఉన్నాయా.. మాయమయ్యాయా..?
ప్రభుత్వ మందుల సరఫరాలో ఈ బ్యాచ్ ఎక్కడ మాయమైంది? కంపెనీ నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్లింది? రవాణా సమయంలో తప్పిపోయిందా? లేక ఇతర మార్గాల్లో బయటకు వెళ్లిందా? అనే కోణాల్లో సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. ఇంకా ఏడాదిన్నర కాలం వినియోగించదగిన మందులు చెత్తలో కనిపించడం ప్రభుత్వ సొమ్ము వృథాపై కూడా అనుమానాలకు తావిస్తోంది.
ఉన్నతాధికారులకు సమాచారం
ఈ ఘటనపై పూర్తి వివరాలను జిల్లా మేజిస్ట్రేట్తో పాటు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ సంగీత సత్యనారాయణ, ఐఏఎస్కు డీఎంహెచ్వో డాక్టర్ వెంకట్ ఈ-మెయిల్ ద్వారా పంపించినట్లు సమాచారం. ఘటనపై సమగ్ర విచారణ జరిపి అసలు వాస్తవాలను వెలికితీసే అవకాశం ఉంది. ఎక్స్పైరీ తేదీ ఉన్న ప్రభుత్వ మందులు రోడ్డు పక్కన ఎలా వచ్చాయి..? తెలంగాణకు సరఫరా కాని బ్యాచ్లు ఇక్కడికి ఎలా చేరాయి..? ఈ మందుల మిస్టరీ వెనుక అసలు కథ ఏమిటన్నది ఉన్నతస్థాయి విచారణలో తేలాల్సి ఉంది.






