18-07-2025 12:28:14 AM
సిద్దిపేట, జూలై 17 (విజయక్రాంతి)/ హుస్నాబాద్: ప్లాస్టిక్ రహిత విప్లవం హుస్నాబాద్ నుంచి ప్రారంభమైందని, దీంతో తెలంగాణలో ఒక కొత్త శకం ఆరంభమైందని గవర్నర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి పేరున ఉన్న పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు.
మానవ సేవ చేసే అవకాశాలు అరుదుగా వస్తాయని, ఈ బర్తన్ (స్టీల్) బ్యాంక్ చిన్న పనే అయినా, దాని ప్రభావం ఐటీ, ఆటోమొబైల్ విప్లవాలను మించిపోయే స్థాయిలో ఉంటుందన్నారు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన ఉద్యమం, గ్రామాలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మహిళా శక్తి విప్లవానికి ప్రతీకలు అని పేర్కొన్నారు.
ఇంత మంచి ఆలోచన తన సొంత రాష్ర్టం త్రిపురలో కూడా లేదని, ప్రజల మేలుకోరి ప్రారంభించిన స్టీల్ బ్యాంక్ ప్రజల గుండెల్లో నిలిచిపోవడంతో పాటు వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని అభినందించారు. ఇటీవల ప్రపంచ సుందరిమణుల పోటీ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన సుందరీమణుల పోటీదారులతో గవర్నర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విందులో ప్లాస్టిక్ వినియోగించకుండా ఆకులతో తయారుచేసిన పాత్రలో మాత్రమే వడ్డించామని, దీనివల్ల ప్రజల్లో మంచి సంకేతం వెళ్లిందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్టు తనకు వివరించడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ పనితీరుపై రాష్ర్ట గవర్నర్ ప్రశంసలు కురిపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 160 గ్రామాల్లోని 270 మహిళా సంఘాలకు 500, 400, 300 కిట్లతో కూడిన స్టీల్ బ్యాంకులు పంపిణీ చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని 340 హోటళ్లలో 3,400 స్టీల్ గ్లాసులు, 74 వేల రైస్ ప్లేట్లు ఇదివరకే పంపిణీ చేసినట్టు తెలిపారు. నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడమే తన లక్ష్యమని, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనారోగ్యాలను నివారించడమే ఉద్దేశమని చెప్పారు. పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల కేవలం భూమికి కాకుండా మన ఆరోగ్యానికీ హాని కలుగుతుందన్నారు.
కాన్సర్, ఇతర వ్యాధుల ముప్పు ఉంటుందన్నారు. కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని, మన పూర్వీకులు ప్లాస్టిక్ లేకుండా ఆరోగ్యంగా జీవించగలిగారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కే లింగమూర్తి, సర్ఫ్ సీఈవో దివ్యా దేవరాజన్, గవర్నర్ సెక్రెటరీ దానకిశోర్, సిద్దిపేట కరీంనగర్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు హైమవతి, పమేలా సత్పతి, స్నేహ శబరీశ్ పాల్గొన్నారు.