3 March, 2026 | 3:58 AM

సీఎం కప్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో రాణించిన క్రీడాకారులు

03-03-2026 12:28 AM

క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, మార్చి 2 : జిల్లా యువజన, క్రీడా కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సి.ఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుత ప్రతిభ కనబర్చి మొదటి, రెండవ, మూడవ స్థానాలను సాధించారు. ఈ క్రీడాకారుల విజయాలను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ వారిని ఘనంగా సన్మానించారు.

క్రీడా రంగంలో జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ విశేషంగా రాణించిన మొత్తం 75 మంది క్రీడాకారులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. విభిన్న క్రీడా విభాగాల్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విషయం తెలిసిందే. అత్య పత్య గేమ్ విభాగంలో బాలబాలికలు 24 మంది పాల్గొని రాష్ట్ర స్థాయిలో మెరిసిన ప్రదర్శన కనబరిచారు. రెజ్లింగ్లో 4 మంది, స్విమ్మింగ్లో 5 మంది, కిక్బాక్సింగ్లో 6 మంది రాష్ట్రస్థాయిలో విజయాలను సాధించి జిల్లాకు గౌరవాన్ని తీసుకువచ్చారు.

వు షు 13 మంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చూపగా, జిమ్నాస్టిక్స్లో 1, యోగా విభాగంలో 1, బాక్సింగ్లో ఇద్దరు రాష్ట్ర స్థాయి పతకాలను సొంతం చేసుకున్నారు. అలాగే బాల్ బాడ్మింటన్లో 3 , పవర్ లిఫ్టింగ్లో 1, కరాటేలో 5, బాడ్మింటన్లో 4, తైక్వాండోలో 6, క్యారమ్లో ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కీర్తి సాధించారు. ఈ విభాగాలన్నింటిలోనూ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు తమ కృషి, నిబద్ధత, ప్రతిభతో ఎవరికి తీసిపోకుండా పోటీ పడి స్థానాలను సాధించడం విశేషం. కలెక్టర్ మాట్లాడుతూ క్రీడా రంగంలో జిల్లాకు గర్వకారణమని, రాష్ట్ర స్థాయి పోటీల్లో మెరిసిన ఈ యువ క్రీడాకారులు భవిష్యత్తులో దేశ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి టి.అఖిలేష్ రెడ్డి ,సిబ్బంది పాల్గొన్నారు.