3 June, 2026 | 1:48 AM

జనగణన సర్వేకు సహకరించాలి

03-06-2026 12:00 AM

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, జూన్ 2 (విజయక్రాంతి): జనగణన2027 సర్వే దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, ప్రజలందరూ ఎనిమ రేటర్లకు సహకరించి తమ వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయించుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి జనగణన విజయవంతం కావడానికి తోడ్పడాలని సూచించారు. పట్టణంలో జరుగుతున్న జనగణన 2027 సర్వేలో భాగంగా మంగళవారం అధికారులు జగదీశ్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ వివరాలను నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన సర్వే నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగణన ద్వారా సేకరించే గణాంకాలు ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా సర్వేలో పాల్గొని ఖచ్చితమైన వివరాలు అందించాలని కోరారు.

ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య మాట్లాడుతూ పట్టణంలో ఈ నెల 12వ తేదీ నుంచి సర్వే నిర్వహిస్తున్నామని, వచ్చే నెల 9వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. సర్వే కోసం వచ్చే ఎనిమరేటర్లకు ప్రజలు సహకరించాలని, ఎనిమరేటర్లు కూడా ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా సంపూర్ణంగా సర్వే నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీలింగ్ అసిస్టెంట్ గోపారపు రాజు, టీపీబీఓలు,అఖిల్ రెడ్డి,ప్రశాంత్,రెహమాన్,శివాజీ సూపర్వైజర్ గన్నా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.