21 July, 2026 | 11:21 AM

పెద్ద కుమారుడి వేధింపుల నుంచి కాపాడండి..

21-07-2026 12:00 AM

న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను ఆశ్రయించిన  వృద్ధ తల్లిదండ్రులు 

భద్రాద్రి కొత్తగూడెం జులై 20 (విజయక్రాంతి): కడుపున పుట్టిన కొడుకే కసాయిగా మారి ... వృద్ధులమని కూడా చూడకుండా నిర్ధాక్షణంగా ఇంటి నుంచి గెంటి వేశారంటూ  వృద్ధులమైన తమకు న్యాయం చేయాలని  సోమవారం ప్రజావాణిలో వృద్ధ దంపతులు కలెక్టర్ ను వేడుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని ఇల్లందులపాడు తండాకు చెందిన భూక్య లక్ష్మి, మంగ్యాలు కలెక్టర్లు వేడుకొన్నారు. తమకు ముగ్గురు కుమారులని, పెద్ద కుమారుడు స్థానిక కేటీపీఎస్ లో డి ఈ గా విధులు నిర్వహిస్తున్నాడని వారు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న గత 25 సంవత్సరాలుగా తమ ఆలన, పాలన పట్టించుకోలేదని. చివరకు ఉంటున్న ఇల్లు కూడా తనదేనంటూ నిర్ధాక్షణంగా ఇంటి నుంచి గెంటి వేసి నడిరోడ్డుపై పడవేశారని వాపోయారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు న్యాయం చేయాలని, ఇంటిని తిరిగి అప్పగించాలని వారు వేడుకొన్నారు. ఆస్తికోసం  కడుపున పుట్టిన కొడుకే తమను వేధిస్తున్నారని వారి వేధింపుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. ఫిర్యాదును పరిశీలించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పరిశీలించే చర్యలు తీసుకోవాలంటూ డి డబ్ల్యూ ఓ లెనినా కు సిఫారసు చేశారు.