04-10-2025 01:23:56 PM
బిహార్ యువతకు ఈసారి డబుల్ బొనాంజా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో పీఎం-సేతు(PM-Setu Scheme) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. విద్య, నైపుణ్యాభివృద్ధికి పథకం తోడ్పడుతుందని ప్రధాని సూచించారు. బీహార్ లోని 19 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. బీహార్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల బీహార్ యువతకు(Bihar youth) ఈసారి డబుల్ బొనాంజా వచ్చిందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్, ఉపాధి అవకాశాలు దక్కాలంటే నైపుణ్యాలు కావాలని వివరించారు.
విజ్ఞాన్ భవన్‌లో రూ.62,000 కోట్లకు పైగా విలువైన యువతకు ప్రాధాన్యత ఇచ్చే వివిధ కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ప్రధాని మోదీ(Narendra Modi) బీహార్‌లో పునరుద్ధరించిన ముఖ్యమంత్రి నిశ్చయ స్వయం సహాయత భట్టా యోజనను ప్రారంభించారు. ఇది రెండు సంవత్సరాల పాటు 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు నెలవారీ రూ. 1,000 భత్యం అందిస్తుంది. పరిశ్రమ ఆధారిత కోర్సులు, వృత్తి విద్యను ప్రోత్సహించడానికి బీహార్‌లో జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. బీహార్‌లోని నాలుగు విశ్వవిద్యాలయాలలో కొత్త విద్యా, పరిశోధన సౌకర్యాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. బీహార్ లో నీట్ పాట్నా కొత్త క్యాంపస్‌ను అంకితం చేశారు.