calender_icon.png 17 February, 2026 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మోడల్’ క్యాడర్ విభజనకు లైన్‌క్లియర్

17-02-2026 01:58:54 AM

కోర్టు ఉత్తర్వుల మేరకు ఇప్పుడు పీవో అమలు

ప్రిన్సిపాళ్లు, పీజీటీలను మల్టీజోన్లుగా, టీజీటీలను జోన్ల వారీగా..

పదోన్నతులు ఇవ్వాలి: భూతం యాకమల్లు, టీఎంఎస్‌టీఏ అధ్యక్షుడు

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు సంబంధించిన క్యాడర్ విభజనకు లైన్ క్లియర్ అయింది. ఈ స్కూళ్లలో దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పీవో (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) ఆర్డర్స్ అమలు చేయాలని 2022 ఆగస్టు, 2025 జూలైలో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ 20 మంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోతూ వచ్చింది.

ఈ క్రమంలో తాజాగా సోమవారం ఈ కేసు విచారణకు రావడంతో కోర్టులో పిటిషన్ వేసిన 20 మందిని మినహాయించి మిగతా ఉపాధ్యాయులకు పీఓ అమలు చేసుకోవచ్చని కోర్టు చెప్పడంతో క్యాడర్ విభజనకు మార్గం సుగమమైంది. దీనిప్రకారం ప్రిన్సిపాళ్లు, పీజీటీలను మల్టీజోన్లుగా, టీజీటీ ఉపాధ్యాయులను జోన్ల వారీగా క్యాడర్ విభజన చేయనున్నారు. టీజీటీ నుంచి పీజీటీగా పదోన్నతులు పొందే వారిలో దాదాపు 400 మంది ఉపాధ్యాయు లుండగా, పీజీటీ నుంచి ప్రిన్సిపాల్‌గా 66 మంది పదోన్నతులు పొందనున్నారు.

ఇన్నాళ్లుగా మోడల్ స్కూళ్లలో క్యాడర్ విభజన జరగకపోవడంతో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని, కోర్టు ఉత్తర్వుల మేరకు ఇప్పుడు పీవో అమలు చేయడం ద్వారా పదోన్నతులు ఇచ్చి, ఖాళీలను భర్తీ చేసే అవకాశం లభించనుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఎటువంటి నష్టం జరగకుండా సంబంధిత ఉత్తర్వులను తక్షణమే అమలు చేసి పదోన్నతులు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.