వేటగాళ్ల ఉచ్చు.. ప్రాణాలకు ముప్పు

26-04-2024 01:36:30 AM

అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులే టార్గెట్ 

విద్యుత్ తీగలు తగిలి ఇటీవల ఓ జవాన్ మృతి

తాజాగా బిట్టుపల్లిలో మరో యువకుడు మృత్యువాత

వేటగాళ్ల ఆగడాలను అరికట్టాలని గ్రామస్తుల డిమాండ్


మంథని, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఎన్ని కఠిన చట్టాలు అమలవుతున్నా.. ఎన్ని కఠినమైన శిక్షలు అమలవుతున్నా వేటగాళ్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడుతూనే ఉన్నారు. వారు అమర్చే ఉచ్చులు, విద్యుత్ తీగలకు వన్యప్రాణులే కాదు మనుషులు కూడా బలి అవుతున్నారు. తాజాగా బుధవారం రాత్రి మంథని మండలం బిట్టుపల్లి పొలాల్లో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై జెట్టి కృష్ణ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. చేతికొచ్చిన కుమారుడు మృతిచెంద డంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బుధవారం ఉదయం మంథ ని పోలీసులు, ట్రాన్స్‌కో అధికారులు యువకుడు మృతిచెందిన స్థలాన్ని పరిశీలించారు. వేటగాళ్లు బిగించిన విద్యుత్ తీగల వల్లే కృష్ణ మృతిచెందాడని గుర్తించారు. ఇదే రోజు ఘటనా స్థలానికి కిలోమీటర్ దూరంలో అమర్చిన విద్యుత్ తీగలను అధికారులు తొలగింపజేశారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. కృష్ణ మృతికి కారణమైన పలువు రు నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది.

కాటారం ప్రాంతంలోనూ..

కాటారం మండలంలోని అటవీప్రాంతం లో ఇటీవల సీర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఓ జవాను మృతిచెందాడు. ఈ ఘటన మరువకముందే బిట్టుపల్లిలో మరో ఘటన చోటుచేసుకోవ డం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తున్నది. వేటగాళ్ల ఆగడాలను అరికట్టకపోతే మున్ముందు ఎంతోమంది ప్రాణాలు కోల్పో యే ప్రమాదం ఉందని వారు వాపోతున్నా రు. వేటగాళ్లు వన్యప్రాణాల మాంసంతోపాటు తోళ్లు, కొమ్ములు, గోర్లను స్మగ్లింగ్ చేస్తున్నారని, యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అటవీ, పోలీస్‌శాఖ స్పందించి వేటగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.