వారిపై ఉగ్ర సెక్షన్లే

26-04-2024 01:37:39 AM

n ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశ భద్రతకు సాఫ్ట్‌వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేసిన వారిపై ఐటీ యాక్ట్ (66 ఎఫ్) కింద సైబర్ టెర్రరిజం కేసులు ప్రయోగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని చౌర్యం చేశారని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఈక్రమంలో నలుగురిపై సైబర్ టెర్రరిజం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు అనుమతించాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు తాజాగా నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ సెక్షన్ల కింద నేర నిరూపణ జరిగితే జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.