భానుడి భగభగలు

26-04-2024 01:35:46 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 ( విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సామాన్య ప్రజానికానికి దడ పుట్టిస్తున్నాయి. దీనికి తోడు వడగాలులు కూడా  వీస్తుండంతో ఉదయం 11.30  గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు బయటకు రావాలంటే జనం హడలెత్తిపోతున్నారు. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజులు  ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా గురువారం  ఖమ్మం, నల్లగొండలలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 40 డిగ్రీలకు  తగ్గకుండా నమోదు కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు మూడు రోజులు 40 నుంచి 42 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు  మరో 2  డిగ్రీలు అధికంగా నమోదై 43  నుంచి 45 డిగ్రీలు కావడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా 43 డిగ్రీలు  నమోదు కాగా, అత్యల్పంగా  24 నుంచి 27 డిగ్రీలు నమోదు అయ్యాయి. వచ్చే మూడు రోజులు నగరంలో వాతావరణం పొడిగా ఉంటుందని  వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.