25 February, 2026 | 4:23 AM

అవిముక్తేశ్వరానంద సరస్వతిపై పోక్సో కేసు

25-02-2026 12:56 AM
  1. స్వామీజీ శిష్యుడు ముకుందానంద గిరిపై కూడా..
  2. ఇద్దరు బాలురను లైంగికంగా వేధించారనే ఆరోపణలు
  3. పోక్సో కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు
  4. కావాలనే నాపై కేసులు.. యూపీ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది: అవిముక్తేశ్వరానంద సరస్వతి

లక్నో, ఫిబ్రవరి ౨౪: ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్ శంకరాచార్యస్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతితోపాటు ఆయన శిష్యుడు ముకుందానంద గిరిపై పోక్సో కేసు నమోదైంది. ప్రయాగ్‌రాజ్‌లోని ఝూన్సీ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల ౨౧న కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు నిందితులిద్దరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మాఘమేళా, మహా కుంభమేళా సమయంలో నిందితులు తమ ఆశ్రమంలో గురుసేవ పేరుతో ఇద్దరు మైనర్ బాలురను లైంగికంగా వేధించారనేది ప్రధాన ఆరోపణ.

పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు పోక్సో చట్టంలోని వివిధ నిబంధనల కింద దర్యాప్తు చేయనున్నారు. జగద్గురు రాంభద్రాచార్య శిష్యుడు అశుతోష్ బ్రహ్మచారి మహరాజ్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, పిటిషనర్ అశుతోష్ బ్రహ్మచారి మాత్రం బాలురపై లైంగిక వేధింపులు జరిగాయనేది వాస్తవమని, ఇదే విషయంలో తాను ఠాణాను ఆశ్రయించానని, తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతోనే తాను కోర్టును ఆశ్రయించానని తెలిపారు. 

రాజకీయపరమైన కక్షలు?

ఇద్దరు స్వామీజీలపై నమోదైన కేసుల వెనుక రాజకీయపరమైన కక్షలు ఉన్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం తనపై కక్షగట్టి కేసులు బనాయించిందని స్వామీజీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. స్వామీజీపై పిటిషన్ దాఖలు చేసిన అశుతోష్ బ్రహ్మచారికి, గతంలో అనేక తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర ఉందని చెప్తున్నారు.

శ్యామ్లీ జిల్లా కాండ్లా పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికీ కేసు దర్యాప్తు జరుగుతున్నదని వెల్లడించారు. జనవరిలో జరిగిన మాఘమేళా సమయంలోనూ స్వామీజీతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని మండిపడుతున్నారు. 2004లో నాడు తమిళనాడులో అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వం కంచి స్వామి జయేంద్ర సరస్వతిని అరెస్టు చేయించిందని, ఆ చర్యతో తదుపరి ఎన్నికల్లో జయలలిత ప్రభుత్వం పడిపోయిందని గుర్తుచేశారు.

ఉత్తరప్రదేశ్‌లో మాయావ తి, అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాలు కూడా ఆధ్యాత్మిక గురువులను టార్గెట్ చేసినందువల్లే పడిపోయాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తున్నదని, వారికి కూడా పరాభవం తప్పదని హెచ్చరించారు. ఆ రాష్ట్రానికి చెందిన విపక్ష నేతలు కూడా స్వామీజీకి మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు రామశంకర్ దీక్షిత్ అనే స్వతంత్ర జర్నలిస్టు సంచలన విషయాలను బయటపెట్టారు. అశుతోష్ తనను ఫోన్‌లో సంప్రదించాడని, తన ముగ్గురు కూతుళ్ల ఒకరిపై అవిముక్తేశ్వరానంద స్వామీజీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ప్రచారం చేయాలని కోరాడని వెల్లడించాడు. తాను ఒప్పుకోకపోవడంతోనే అశుతోష్ మరోమార్గంలో స్వామీ జీపై కేసులు బనాయించారని తెలిపాడు. ఈ మేరకు అధికారులకు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ప్రస్తుతం అతని చేవ్రాలుతో ఉన్న ఆ వివరణ ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అశుతోశ్ కుట్ర ఇది

నేను నా కుటుంబంతో కలిసి షాజహా న్‌పూర్‌లో ఉంటున్నాను. ఈ నెల 19వ తేదీ రాత్రి నా వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చా రు. ముందుగా మా నాన్న దండి స్వామి ఆత్మానంద్ గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో తాము చెప్పిన పని చేస్తే, భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్తామని చెప్పారు. నేను పని ఏంటని అడిగా. వారు అశుతోష్ కు కాల్ చేసి నాతో మాట్లాడించారు. అశుతోష్ నన్ను పలకరించి, ‘నువ్వు నాకు సోదరిడి లాంటి వాడివి. నీ నుంచి మాకు ఒక సాయం కావాలి’ అన్నాడు. ‘నేను ఏమిటా సాయం..?’ అని నేనడిగా ను. అందుకు అశుతోష్ ‘నీకు ముగ్గురు ఆడపిల్లలున్నారు కదా..

వారిలో ఒకరిపై స్వామి అవిముక్తేశ్వరానంద్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నువ్వు సంచలన ఆరోపణలు చేయాలి. నేను అందుకు ఒప్పుకోలేదు. మేం దండి స్వామీజీ కుటుం బం నుంచి వచ్చిన వాళ్లం, మేం ఎవరి మీదా తప్పుడు నిందలు వేయం’ అని గట్టి గా చెప్పాను. దీంతో అశుతోష్ కోపంగా ‘నేను ఎవరో నీకు తెలుసు కదా.. జాగ్రత్తగా ఉండు‘ అని నన్ను బెదిరించాడు. తర్వాత వెంటనే కాశీలో అవిముక్తేశ్వారనంద సరస్వతిని కలిసి జరిగిన విషయం చెప్పాను.

 రామశంకర్ దీక్షిత్, స్వతంత్ర జర్నలిస్టు

కావాలనే నాపై కేసులు: అవిముక్తేశ్వరానంద సరస్వతి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని ప్రభుత్వ పెద్దలు కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బాలురను నేనూ, నా శిష్యుడు ముకుందానంద స్వామీజీ లైంగిక వేధించామన్నది అవాస్తవం. పిటిషనర్ పేర్కొన్న ఇద్దరు బాలురు అసలు మా గురుకులంలోకి ఎన్నడూ రాలేదు. ఇది కేవలం నాపై జరుగుతున్న కుట్ర. గోవధ నిషేధం, కేదార్‌నాథ్ ఆలయంలో బంగారం స్కాంను ప్రశ్నిస్తున్నందుకే రాష్ట్రప్రభుత్వం నన్ను లక్ష్యం చేసుకుంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు నేను పూర్తిగా సిద్ధం. నన్ను అరెస్ట్ చేసినా భయపడను.