1 August, 2026 | 9:51 PM

దెబ్బతిన్న సీసీ రోడ్డు

01-08-2026 09:12 PM

- రూ.5 లక్షల పనుల్లో నాణ్యత లోపాలపై స్థానికుల ఆగ్రహం

కంగ్టి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాజారాం తండాలో ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద రూ.5 లక్షల వ్యయంతో నెల రోజుల క్రితం నిర్మించిన సీసీ రోడ్డు దెబ్బతినడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ మందిరం రహదారిపై నిర్మించిన ఈ రోడ్డుకు పలు చోట్ల పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడటంతో పాటు కాంక్రీట్ కంకర ఊడిపోతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. నిర్మాణం పూర్తయి నెల రోజులు కూడా కాకముందే రోడ్డు దెబ్బతినడం పనుల నాణ్యతపై అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.నాసిరకం నిర్మాణంతో ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించిన స్థానికులు, సంబంధిత అధికారులు వెంటనే రోడ్డు పనుల నాణ్యతపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న రోడ్డును తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు.