1 August, 2026 | 9:53 PM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి

01-08-2026 09:15 PM

– అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, బోధన–అభ్యాసన ప్రక్రియ బలోపేతానికి ప్యానెల్ ఇన్‌స్పెక్షన్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ప్యానెల్ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్యానెల్ ఇన్‌స్పెక్షన్లు కేవలం తనిఖీలుగా కాకుండా విద్యా నాణ్యతను మెరుగుపరిచే మార్గదర్శక ప్రక్రియగా ఉండాలన్నారు. విద్యార్థుల అభ్యాసన స్థాయి, తరగతి బోధన, నోటుబుక్స్, మూల్యాంకనం, హాజరు, పరిశుభ్రత, గ్రంథాలయం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, ప్రయోగశాలలు, క్రీడలు, మౌలిక వసతులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, సృజనాత్మక బోధనతో ప్రతి విద్యార్థి నేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.

ప్యానెల్ తనిఖీల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దుతూ, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసాన్ని మరింత పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్యానెల్ బృంద సభ్యులు పాల్గొన్నారు.