కెరమెరిలో మళ్లీ రగిలిన పోడు భూముల వివాదం
- రైతులుఅటవీ శాఖ అధికారుల మధ్య ఉద్రిక్తత
- వాహనాలను అడ్డుకున్న రైతులు
- రాళ్ల దాడికి యత్నించారని అధికారుల ఆరోపణ
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 16(విజయ క్రాంతి): కెరమెరి మండలంలో పోడు భూముల వివాదం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవుడుపల్లి బీట్ పరిధిలోని సుర్దాపూర్ గ్రామ శివారులో పోడు రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారుల వాహనాలను రైతులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ సందర్భంగా అటవీశాఖ అధికారుల వాహనంపై కొందరు రైతులు రాళ్ల దాడికి ప్రయత్నించారని అటవీ శాఖ అధికారి ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసు లు భారీగా ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.గత 35 నుంచి 40 ఏళ్లుగా తాము ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్నేళ్లుగా సాగు చేస్తున్న భూముల విషయంలో ఇప్పుడే అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు నాటేందుకు పొలాలకు వెళ్తున్న తమను అడ్డుకోవడం వల్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తోందని తెలిపారు.మమ్మల్ని ఎలా అడ్డుకుంటారు మా భూముల్లో మొక్కలు నాటనివ్వం.. దేనికైనా సిద్ధంగా ఉన్నాం అంటూ రైతులు హెచ్చరించారు.
కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.అటవీ శాఖ అధికారులు మాత్రం సుర్దాపూర్ పరిధిలో సుమారు 100 హెక్టార్లలో అక్రమ కల్టివేషన్ జరుగుతోందని పేర్కొన్నారు. అటవీ భూములను రక్షించే చర్యల్లో భాగంగానే మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.






