హోటల్ యజమానులు పరిశుభ్రత పాటించాలి
మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్
జహీరాబాద్, జూన్ 16: జహీరాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఆహార భద్రత పాటించాలని జహీరాబాద్ మునిసిపల్ కమిషనర్ జి.ప్రభాకర్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రభాకర్ మాట్లాడుతూ పట్టణంలోని దాబాల యజమానులు వ్యర్థ పదార్థాలను రోడ్లపై పడేయకుండా తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా ఉంచి వాటిని తగిన ప్రదేశాలలో వేయాలని ఆయన తెలిపారు.
హోటల్ యజమానులు ప్రభు త్వ స్థలాలను ఆక్రమించరాదని, పరిసర ప్రాంతాలలో తిను బండారాలను పారవేయవద్దని, దీంతో డెంగ్యూ మలేరియా అతిసార వంటి వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పృథ్విని హాజరై హోటల్ యజమానులకు తగు సూచనలు, సలహాలు అందించారు.






