3 March, 2026 | 3:24 AM

పోలవరం నిండా లోపాలే!

03-03-2026 01:35 AM
  1. ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర ఇంజనీరింగ్ తప్పులు

డయా ఫ్రమ్ వాల్ బలహీనతలు, భద్రతా ప్రమాణాల ఉల్లంఘన 

కాంక్రీట్‌లో రోజూ బ్లీడింగ్ 

పగుళ్లకు ప్లాస్టరింగ్‌తో కప్పిపుచ్చే పూతలు

అప్రోచ్ ఛానల్ తవ్వకాలపై అనుమానాలు

నిర్లక్ష్యం చేస్తే లక్షలాది మంది ప్రజలకు ప్రాణసంకటం

సెంటర్ ఫర్ లిబర్టీ సంచలన ఆరోపణలు

ప్రభుత్వం పట్టించుకోకపోతే, సుప్రీంకోర్టుకు వెళ్తామన్న సంస్థ

అంతర్జాతీయ నిపుణులతో స్వతంత్ర భద్రతా ఆడిట్‌కు డిమాండ్

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన ఇంజ నీరింగ్ లోపాలు, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు జరుగుతున్నాయని సెంటర్ ఫర్ లిబర్టీ సంచలన ఆరోపణలు చేసింది. డయా ఫ్రమ్ వాల్ రోజురోజుకూ బలహీనపడుతోందని, భద్రతా ప్రమాణాలను ఉల్లం ఘిం చారని స్పష్టం చేసింది. కాంక్రీట్‌లో రోజూ బ్లీడింగ్ అవుతోందని, పగుళ్లకు ప్లాస్టరింగ్‌తో కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. అప్రోచ్ ఛానల్ తవ్వకాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేసింది.

నిర్లక్ష్యం చేస్తే లక్షలాది మంది ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోందని సెంటర్ ఫర్ లిబర్టీ ఆరోపించింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సంస్థ హెచ్చరిం చిది. అంతర్జాతీయ నిపుణులతో స్వతంత్ర భద్రతా ఆడిట్ చేయించాలని డిమాండ్ చేసింది. సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ ప్రతినిధి నలమోతు చక్రవర్తి వెల్లడించిన వివరాల ప్రకారం..

డ్యాంకు గుండెకాయగా భావించే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో తీవ్రమైన నాణ్యతా లోపాలు చోటుచేసుకున్నాయని, కాంక్రీట్‌లో రోజూ బ్లీడింగ్ జరగడం వల్ల గోడ బలహీనపడుతోందని, ఏర్పడిన పగుళ్లను ప్లాస్టరింగ్ ద్వారా కప్పిపుచ్చే ప్రయ త్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సు మారు 400 మీటర్ల పొడవునా డయాఫ్రమ్ వాల్ ఎత్తును 19 మీటర్ల నుంచి 18.5 మీటర్లకు అనధికారికంగా తగ్గించినట్లు ఆరోపిం చారు.

ఇది నిర్మాణ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నట్లు వెల్లడించారు. డ్యామ్ నిర్మాణంలో కీలకమై న గ్యాప్-1 ట్రెంచ్ లోతును సరైన అనుమతులు లేకుండా మార్చడం వల్ల నిర్మాణ స్థిరత్వానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. అలాగే 2023లో దెబ్బతిన్న స్పిల్వే గైడ్ బండ్ పునర్నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించింది.

గైడ్ బండ్ బలహీనంగా ఉంటే మొ త్తం స్పిల్‌వే నిర్మాణానికే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిం చింది. స్పిల్‌వే అప్రోచ్ ఛానల్లో ఇంకా 38.55 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉండగా, కేవలం 5 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు లెక్కలు చూపించి తవ్వకాలను నిలిపివేసే ప్రయత్నం జరుగుతోందని సంస్థ ఆరోపించింది.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం సంబం ధిత సంస్థల మధ్య సమన్వయ లోపమని సంస్థ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజె క్ట్ అథారిటీ, రాష్ట్ర జలవనరుల శాఖ, కాం ట్రాక్టర్ల మధ్య బాధ్యతారాహిత్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈరోజు గైడ్ బండ్ కుంగిపోయింది. రేపు డయా ఫ్రమ్ వాల్ కూడా దెబ్బతింటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్‌లో ప్రమాదాన్ని నివారించేం దుకు సెంటర్ ఫర్ లిబర్టీ పలు కీలక డిమాండ్లు చేసింది.

స్వతంత్ర అంతర్జాతీయ నిపుణులతో డయాఫ్రమ్ వాల్ భద్రతా పరీక్షలు చేయించాలని డిమాండ్ చేసింది. స్వతంత్ర క్వాలిటీ కంట్రో ల్, పీఎంసీ నియామకం, నాణ్యత నిర్ధారణ వరకు డ్యామ్ పనులను నెమ్మదించడం, గైడ్ బండ్ మరమ్మతులను అత్యవసరంగా పూర్తి చేయడం, నిర్మాణానికి సంబంధించిన అన్ని సాంకేతిక నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉం చాలని సూచించింది.

ఈ అంశాలను ప్రభు త్వం పట్టించుకోకపోతే, ప్రాజెక్టు భద్రతపై సమగ్ర ఆడిట్ కోసం భారత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సంస్థ హెచ్చరించింది. దేశంలోనే అత్యంత కీలక జాతీయ ప్రాజెక్టుగా భావిస్తున్న పోలవరం నిర్మాణంలో ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి రావడం తీవ్ర ఆం దోళన కలిగిస్తోంది. ప్రభుత్వం, సంబంధిత సంస్థలు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.