బాధితురాలి వద్దకే పోలీసులు
24-04-2026 12:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): గృహహింసకు గురైన మహిళ చెంతకు పోలీసులు చేరుకొని బాధితురాల నుండి ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగూరు గూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లూనావత్ సునీతపై ఆమె భర్త కృష్ణ దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు అందుకున్న వెంటనే ఎస్ ఐ పిట్ల ప్రవీణ్ కుమార్ నేరుగా ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించి అక్కడికక్కడే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు, ఎఫ్‌ఐఆర్ కాపీని బాధితురాలికి అందజేశారు. పోలీసుల స్పందనపై మండల ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ, ఇలాంటి చర్యలు బాధితులకు నమ్మకం కలిగిస్తాయని పేర్కొన్నారు.






