సివిల్ దందాల్లో పోలీసులు!
ఆమ్యామ్యాలు పుచ్చుకొని అడ్డగోలు సెటిల్‌మెంట్లు
సామాన్యులపై దౌర్జన్యం, అమాయకులకు అన్యాయం
కోర్టులు హెచ్చరించినా మారని పలువురు ఖాకీలు
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. ఆమ్యామ్యాలు పుచ్చుకొని సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి సివిల్ పంచాయితీలు వెలగబెడుతున్నారు. సివిల్ సెటిల్‌మెంట్లలో పోలీసుల జోక్యం ఉండొద్దని కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు అధికారుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. చట్టాలు తమ చుట్టాలు అనే విధంగా, కోర్టు ఉత్తర్వులతో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా కొందరు అక్రమ పోలీసు అధికారులు సివిల్ తగాదాలు సెటిల్ చేసి కోట్ల ఆస్తికి పడగలెత్తినట్లు నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయి.
వీటన్నింటినీ గమనిస్తున్న ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) వరుసగా దాడులు చేస్తూ అవినీతి అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఏసీబీ వలలో చిక్కిన వారు ఎందరో ప్రస్తుతం ఊసలు లెక్కిస్తున్నారు. అయిన పోలీసు శాఖ అధికారుల్లో మార్పు రావడం లేదు. ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో పోలీసుశాఖ అధికారులు మొదటి స్థానంలో ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి) : ఇన్నాళ్లు ఎలక్షన్ కోడ్‌తో సైలెంట్‌గా ఉన్న కొందరు పోలీసు అధికారులు సివిల్ తగాదాలు, భూ వివాదాల సెటిల్‌మెంట్ల జోరు పెంచారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసుశాఖలో పెద్దగా బదిలీలు జరగలేదు. కానీ, రాష్ట్రంలో శాంతిభద్రలను పరిరక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తన మార్క్ చూపించుకోవడానికి తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఇందులో భాగంగా త్వరలోనే పోలీసు శాఖ లో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
కోర్టులు చెప్పినా..
ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన సమస్యలు సివిల్ కేసుల పరిధిలోకి వస్తాయి. ఒకరికి సంబంధించిన ఆస్తులను ఇతరులు ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతుంటే, ప్రామిసరీ నోటు హామీతో ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకుంటే కోర్టులో సివిల్ కేసులు దాఖలు చేయవచ్చు. వీటిని కోర్టులో సీపీసీ (సివిల్ ప్రొసిజర్ కోడ్) ప్రకారం నేరుగా గానీ, న్యాయవాది ద్వారా గానీ బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. సివిల్ కేసులను పోలీసులు సంబంధం ఉండదు, అసలు పట్టించుకోకూడదు. ఒకవేళ సివిల్ తగాదాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగితే మాత్రం పోలీసులు జోక్యం చేసుకుంటారు.
నేర తీవ్రతను బట్టి చర్యలు తీసుకుం టారు. అలాగే సివిల్ కేసుల విచారణ కోర్టు పరిధిలోనే జరుగుతుంది. నిందితులు కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలి. వారు కూడా కోర్టు ఆదేశాలను దిక్కరిస్తే కోర్టు వారి అరెస్ట్‌కు పోలీసులను ఆదేశిస్తుంది. సివిల్ కేసులో ఉచితంగా న్యాయ సహాయం పొందే అవకాశాన్ని కోర్టులు కల్పిస్తున్నాయి. కోర్టులో న్యాయవాదిని పెట్టుకోవడానికి స్తోమత లేని వారు ఉచితంగా ప్రభుత్వ న్యాయవాది ద్వారా సివిల్ కేసు వేసుకోవచ్చని కోర్టులు చెబుతున్నాయి. కానీ వీటన్నిం టిని బేఖాతరు చేస్తూ కొందరు అవినీతి పోలీసు అధికారులు తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
గాడ్‌ఫాదర్‌ల చుట్టూ పైరవీల కోసం ప్రదక్షిణలు..
సిటీ శివారు ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం పైరవీలు ప్రారంభమయ్యాయనీ తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం వైపు దృష్టి సారించింది. దీంట్లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు) లోపల ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం హైదరాబాద్‌ను మెట్రో నగరంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. అలాగే ఎన్నికల కోడ్ ముగియడంతో పోలీ సు శాఖలో బదిలీల పర్వం ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర శివారు ప్రాంతాల్లో నచ్చిన స్థానంలో పోస్టుల కోసం ఇప్పటినుంచే కొందరు పోలీసు అధికారు లు తమ గాఢ్‌ఫాదర్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అడిగినంతా ఇవ్వడానికి సదరు పోలీసు అధికారు లు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరికొందరు తమకు పరిచయమున్న రాజకీయ నాయకులను కలిసి పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ మధ్య ఏసీబీకి చిక్కిన పోలీసులు
- ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు ను మూసివేయడానికి కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్ రెడ్డి వద్ద పోలీసులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఏసీ బీ అధికారులు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌పై దాడులు నిర్వహించి రూ. 3 లక్షల లంచం తీసుకుంటున్న సబ్ ఇన్‌స్పెక్టర్ షేక్ షఫి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.వీరస్వామి, ఉపేందర్ ముగ్గురిని అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు.
- హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు అధికారాన్ని దుర్వినియోగం చేసి బహిరంగ మార్కెట్ ధర ప్రకారం రూ.50 కోట్లకి పైగా అక్రమాస్తులు సంపాదించారని ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ఏసీబీ స్పెషల్ ఫోకస్..
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం తగ్గిపోతుందనే భావనతో సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా త్వరలోనే పోలీసుశాఖలో భారీ ప్రక్షాళ న దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ప్పటికీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ప్రస్తు తం హోంశాఖ తన వద్దే పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ వరుసదాడులతో అవినీతికి పాల్పడుతున్న పోలీసుల గుండెల్లో గుబులు మొదలయ్యింది.
ఎంచ క్కా ఏసీ రూమ్‌లలో ఉద్యోగాలు.. లక్ష ల్లో వేతనాలు.. సకల సౌకర్యాలు.. సమాజంలో మంచి గౌరవం, ఇవన్నీ సరిపోవంటూ కొందరు ప్రభుత్వ శాఖల అధికారులు లంచాల పేరుతో ప్రజలను పీడించుకుతింటున్నారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ ప్రజలను పీడిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న వారి భర తం పడుతుంది ఏసీబీ. ఈ క్రమంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో పోలీసు శాఖ అధికా రులు మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.






