22 August, 2026 | 9:17 AM

ఆడపిల్లలను ప్రోత్సహించాలి: సీపీ రష్మీ పెరుమాళ్

22-08-2026 08:19 AM

సిద్దిపేట క్రైం : ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. 'మన పోలీస్ - మన ఊరు' కార్యక్రమంలో భాగంగా సీపీ సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్(Siddipet Three Town Police Station) పరిధిలోని వెల్కటూరు గ్రామాన్ని సందర్శించారు. 'సిద్దిపేట సురక్ష నేత్ర' కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసిన 24 సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించారు. జడ్పీహెచ్ఎస్ ఆవరణలో  పోలీసులు, స్థానిక యువకుల మధ్య ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను టాస్ వేసి  ప్రారంభించారు.

విద్యార్థులు, గ్రామస్థులతో కలిసి ఎంపీహెచ్ఎస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆదిత్య, ఎల్వీ ప్రసాద్, అగర్వాల్ కంటి ఆస్పత్రుల సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై సురభి మెడికల్ కళాశాల, పాఠశాల విద్యార్థులు నృత్య ప్రదర్శన ద్వారా  అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ యోగా, ధ్యానం వైపు మళ్లాలని యోగాసనాలు ప్రదర్శించారు.

అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు సీపీఆర్ చేసే విధానాన్ని సురభి మెడికల్ కళాశాల వైద్యులు డెమో ద్వారా చూపించారు. సైకియాట్రిస్ట్ డాక్టర్ హరీష్ మాట్లాడుతూ, డీ అడిక్షన్  చికిత్స ద్వారా డ్రగ్స్ వ్యసనం నుంచి  సులభంగా బయటపడవచ్చన్నారు. గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ ప్రజలకు సీపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీసు శాఖకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.  కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) కుశాల్కర్, అదనపు డీసీపీ(ఏఆర్) సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్ రెడ్డి, త్రీటౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు పాల్గొన్నారు.