22 August, 2026 | 7:50 AM

డిగ్రీలో 40% మార్కులున్నా డీఎస్సీకి అర్హులే!

14-06-2024 12:10 AM
  1. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
  2. డీఎస్సీ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అవకాశం

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2015 కంటే ముందు డిగ్రీలో 40 శాతం మార్కు లు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కూడా డీఎస్సీకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కల్పించారు. వీరు స్కూల్ అసిస్టెంట్, పీఈ టీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ గురువారం జారీ చేసిన ఉత్వర్వుల్లో తెలిపింది. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీలో 45 శాతం, ఓసీలకు 50 శాతం మార్కులు వచ్చి ఉండాలనే నిబంధన ఉండేది. అయితే దీనిపై కొందరు  సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్  మార్పులు చేసింది.

ఈమార్పులకు అనుగుణంగానే విద్యాశాఖ అధికారులు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం ఉన్న నిబంధనను 40 శాతానికి తగ్గించింది. వీరు స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. ప్రస్తుతం డీఎస్సీకి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 20 వరకు ఇంకా గడు వు ఉండడంతో సుమారు 20 వేల మంది అభ్యర్థు లకు ప్రయోజనం కలగనుంది. అయితే ఇప్పటికే కొంత మంది అభ్యర్థులు తమకు డిగ్రీ లో 40 శాతం మార్కులున్నప్పటికినీ డీఎస్సీకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమం లోనే డీఎస్సీ అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు, టెట్ ఫలితాల నేపథ్యంలో టెట్ స్కోరుతో పాటు ఇతర వివరాలను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం టెట్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో ఎక్కువ స్కోర్ వచ్చిన అభ్యర్థులకు డీఎస్సీ దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.