భజన తండాలో పోలీసుల తనిఖీలు
మహబూబాబాద్, మే 26 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు, రూరల్ సీఐ అంజలి ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భజన తండా గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 5:20 గంటల నుండి ఉదయం 07:30 గంటల వరకు ముమ్మరంగా ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించారు.
గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు సుమారు 120 ఇండ్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 15 వాహనాలను గుర్తించారు. అదేవిధంగా అక్రమంగా నిల్వ ఉంచిన 100 కిలోల నల్ల బెల్లం, 20 లీటర్ల గుడుంబా, 20 కిలోల పటిక,16 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు 200 లీటర్ల బెల్లం ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. స్వాధీనం చేసిన వస్తువులకు సంబంధించి బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు సీఐ తెలిపారు.
తనిఖీల అనంతరం గ్రామస్తులను సమీకరించి దొంగతనాలు, ఇంటి చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ వినియోగం, చెరువుల్లో ఈతకు వెళ్లడం వల్ల కలిగే ప్రమాదాలు, గంజాయి దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు మరియు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, గంజాయి విక్రయాలు, గుడుంబా తయారీ, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఫోర్స్, క్యూ ఆర్ టీ ఫోర్స్, ఏఆర్ మహిళా పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






