27 May, 2026 | 3:00 AM

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు వద్దు

27-05-2026 01:59 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, మే 26 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో తాలూ, తేమ పేరిట కోతలు పెడుతూ రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులను, రైస్ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆమనగల్లు మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని, స్థానిక రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రాల్లో తగినంత సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకుని, లారీలను త్వరగా ఖాళీ చేయాలన్నారు.

ఎండ తీవ్రత దృష్ట్యా రైతులకు తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. మద్దతు ధరలో ఎలాంటి కోతలు పెట్టినా సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, ఏఎంసి వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.