22 July, 2026 | 10:43 AM

పోయే ప్రాణాన్ని చివరి క్షణంలో కాపాడిన పోలీసులు

22-07-2026 10:13 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రైలు పట్టాలపై ఓ యువకుడు పడుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు సమాచారం రావడంతో.. రైలు పట్టాల వెంట పరుగులు తీస్తూ ఆ వ్యక్తి కోసం పోలీసులు కటిక చీకట్లో సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో వెతుకులాట ప్రారంభించారు. చివరికి పట్టాలపై కొంత దూరంలో ఒకచోట అడ్డంగా పడుకున్న వ్యక్తిని గుర్తించారు. అయితే అదే సమయంలో అదే పట్టాలపై ఒక రైలు వేగంగా వస్తుండడంతో పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పట్టాల వెంట మరింత వేగంగా పరిగెత్తి కొద్ది క్షణాల్లో రైలు అక్కడికి చేరుకునే సమయానికి సమయస్ఫూర్తితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని గట్టిగా పట్టి పక్కకు తీసుకెళ్లి  రైలు వెళ్లేంత సేపు గట్టిగా ఒడిసి పట్టుకొని ప్రాణాలు రక్షించారు.

ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖలో నైట్ అలర్టింగ్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్న మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలికి బుధవారం తెల్లవారుజామున సుమారు 02:44 గంటలకు డీజీ కంట్రోల్ రూమ్ నుండి ఓ అత్యవసర సమాచారం అందింది. మహబూబాబాద్ రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో, సీఐ అంజలి వెంటనే వైర్‌లెస్ సెట్ ద్వారా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. తక్షణమే ఎస్ ఐ సుదర్శన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు.

ఇల్లందుకు చెందిన షేక్ వసీమ్ అనే వ్యక్తి తన తమ్ముడు ఇటీవల మరణించడంతో మనస్థాపానికి గురై ట్రాక్‌పై పడుకుని చనిపోవాలని నిర్ణయించాడు. చీకటిగా ఉండడంతో మొదట అతడు ఎవరికీ కనిపించలేదు. ఇదే సమయంలో మణుగూరు ఎక్స్‌ప్రెస్ వేగంగా సమీపిస్తున్న పరిస్థితిలో, పోలీసులు అత్యంత అప్రమత్తంగా వెతుకుతూ చివరకు యువకుడిని గుర్తించారు. రైలు అత్యంత సమీపానికి చేరుకున్న క్షణాల్లోనే చాకచక్యంగా అతడిని పట్టుకుని రైల్వే పట్టాలపై నుంచి సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. అనంతరం అతడిని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. అలాగే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించి, వారి సమక్షంలో అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా సీఐ అంజలి మాట్లాడుతూ, సమయానికి అందిన సమాచారంపై వెంటనే స్పందించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని క్షేమంగా రక్షించడం పోలీసు శాఖ సేవా తత్పరతకు నిదర్శనమని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ లేదా మానసిక సమస్యల కారణంగా ఎవరూ ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదని, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ ఘటనలో మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, ఎస్ ఐ సుదర్శన్, బ్లూ కోట్స్, ఇతర పోలీసు సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు, సేవా తత్పరత ఒక నిండు ప్రాణాన్ని కాపాడి పోలీసు శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచాయని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అభినందించారు.