6 April, 2026 | 2:29 AM

బాధితుల వద్దకే ఖాకీల సేవలు

06-04-2026 12:34 AM

బాధితుల కోసం పోలీసుల కొత్త అడుగు

డోర్ స్టెప్ ఎఫ్‌ఐఆర్‌తో పారదర్శక సేవలు

సంఘటన స్థలంలోనే కేసు నమోదు సౌకర్యం

గ్రామీణ ప్రాంతాలకు పోలీసుల కొత్త సేవ

మహిళలు, వృద్ధులకు మరింత సౌలభ్యం

నేర నియంత్రణలో మరో ముందడుగు

వెంకటాపూర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ప్రజలకు మరింత చేరువగా, వేగ వంతమైన సేవలు, పారదర్శక వ్యవస్థ, ప్రజలకు దగ్గరగా ఉండే పోలీసింగ్ ఇవి నేటి సమాజంలో అత్యవసర అవసరాలుగా మా రాయి. ఈ దిశగా ములుగు జిల్లా పోలీసులు చేపట్టిన వినూత్న చర్య ‘ఆన్సైట్ ఎఫ్‌ఐఆర్’ విధానం. జిల్లా ఎస్పీ సుదీర్ కేకన్ ఆదేశాల మేరకు అమలవుతున్న ఈ పద్ధతి, పోలీస్ సేవలను ప్రజల గడపకు తీసుకెళ్లే కీలక ముందడుగుగా నిలుస్తోంది.

ఆన్సైట్ ఎఫ్‌ఐఆర్ తో మరింత చేరువలోకి న్యాయం

సాంప్రదాయంగా ఒక నేరం జరిగినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉండేది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది బాధితులకు కష్టసాధ్యమవుతుంది. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ‘ఆన్సైట్ ఎఫ్‌ఐఆర్’ విధానాన్ని ప్రవేశపెట్టారు.

బాధితుల వద్దకే పోలీసు సేవలు

ఈ విధానంలో భాగంగా హత్య, అత్యాచారం, దోపిడీ, చోరీ, కిడ్నాప్, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ వంటి సీరియస్ నేరాల్లో బాధితులు ఎక్కడ ఉన్నా వారి నివాసం, ఆసుపత్రి లేదా సంఘటన స్థలంలోనే పోలీసులు చేరుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. దీంతో బాధితులు స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తక్షణమే న్యాయ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు

సంఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వల్ల ఆధారాలు వేగంగా సేకరించే అవకాశం ఉంటుంది. ఇది విచారణను వేగవంతం చేయడమే కాకుండా, నిందితులను త్వరగా పట్టుకునే అవకాశాలను పెంచుతుంది. సమయానికి స్పందన ఇవ్వడం ద్వారా బాధితులకు తక్షణ ఉపశమనం కలుగుతుంది.

గ్రామీణ ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం

ఈ విధానం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. మహిళలు, వృద్ధులు, శారీరకంగా బలహీనంగా ఉన్న వారు పోలీస్ స్టేషన్కు వెళ్లే అవసరం లేకుండా తమ వద్దకే సేవలు అందుకోవచ్చు. ఇది ప్రజల్లో భద్రతాభావాన్ని పెంచడమే కాకుండా, పోలీసులపై నమ్మకాన్ని కూడా బలపరుస్తోంది.