14 March, 2026 | 12:57 AM

ధర్పల్లిలో మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్

14-03-2026 12:11 AM

ధర్పల్లి, మార్చి 13 (విజయక్రాంతి): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని ధర్పల్లి మండలంలో ఇటీవల సంచలనం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.సీతయ్యపేట గుడి తండాకు చెందిన జరుపుల కాంతమణి అనే మహిళ మృతదేహం ఈ నెల 11న ధర్పల్లి గ్రామం బస్టాండ్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు సేకరించిన సమాచారంతో ధర్పల్లి కొత్త బస్టాండ్ ప్రాంతానికి చెందిన గుండ్ల నడుకుడ నర్సయ్య (58)ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సత్యమ్మ రైస్ మిల్ సమీపంలో తనకు ఉన్న ఓపెన్ ప్లాట్లో షెడ్ వేసుకుని కూరగాయలు పెంచుకుంటూ ఉంటానని, అదే సమయంలో కాంతమణితో పరిచయం ఏర్పడిందని నిందితుడు తెలిపాడు.

ఈ నెల 11న ఆమె తన వద్దకు వచ్చిన సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, తనకు డబ్బులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసి లేదంటే గ్రామంలో విషయం చెబుతానని బెదిరించడంతో పరువు పోతుందనే భయంతో కోపోద్రిక్తుడై నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులకు ఒప్పుకున్నాడు.హత్య అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ముందుగా తన షెడ్కు తాళం వేసి మార్కెట్కు వెళ్లి పని చేసి, రాత్రి సమయంలో మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి ప్లాస్టిక్ సంచిలో పెట్టి తన TVS XL వాహనంపై తీసుకెళ్లాడని తెలిపాడు.

దమ్మనపేట ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు పనుల కారణంగా మార్గం బ్లాక్ కావడంతో బస్టాండ్ వెనుక ఉన్న ప్లాట్ల మధ్యగా వెళ్తుండగా వాహనం స్కిడ్ అయి పడిపోవడంతో భయపడి వాహనం మరియు మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయినట్లు వెల్లడించాడు.తదుపరి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.ఈ కేసు దర్యాప్తును సీఐ బిక్షపతి, ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టారు.