21-01-2026 12:01:23 PM
సిట్టింగ్స్‌కు పట్టుకున్న భయం
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీలో ఇటీవల ఖరారైన వార్డు రిజర్వేషన్ల మార్పులు పట్టణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ మార్పులతో సిట్టింగ్, మాజీ కౌన్సిలర్లలో తీవ్ర ఆందోళన నెలకొనగా, మరోసారి అదే వార్డులో పోటీ చేయాలనే ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు రిజర్వేషన్ మారడంతో తమ రాజకీయ భవితవ్యంపై సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 3, 10, 19, 20, 21, 22, 24 వార్డుల్లో జరిగిన రిజర్వేషన్ మార్పుల కారణంగా కొందరు మాజీ కౌన్సిలర్లు రిజర్వేషన్ అనుకూలించే పక్క వార్డుల నుంచి నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతుండగా, అదే సమయంలో ఆయా వార్డుల్లో స్థానికంగా గుర్తింపు ఉన్న నాయకులు బలమైన ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో “ఈసారి స్థానికుడికే అవకాశం ఇవ్వాలి” అన్న స్వరం ప్రజల్లో బలంగా వినిపిస్తుండగా, పక్క వార్డుల నుంచి వచ్చే అభ్యర్థులకు అవకాశం కల్పించబోమని స్థానికులు ముక్తకంఠంతో చెబుతున్నారు. మరోవైపు రిజర్వేషన్ల మార్పులతో రాజకీయ పార్టీల్లోనూ కొత్త సమీకరణలు మొదలవగా, సిట్టింగ్‌లను కాపాడుకోవాలా లేక స్థానికంగా బలమైన కొత్త అభ్యర్థులను ముందుకు తీసుకురావాలా అన్న అంశంపై పార్టీ స్థాయిలో చర్చలు సాగుతున్నట్లు సమాచారం. మొత్తంగా రిజర్వేషన్ల మార్పులు ఇల్లందు మున్సిపాలిటీలో ఈసారి ఎన్నికలను అత్యంత ఉత్కంఠభరితంగా మార్చనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.