ఓటు చైతన్యంతోనే రాజ్యాధికారం
2026 ఆగస్టు 9న నల్గొండ జిల్లాలో బీసీల హక్కుల సాధన కోసం సామాజిక న్యాయ పోరాట యాత్ర అనే నినాదంతో సమావేశం నిర్వహించాం. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించాం. ఈ రాజకీయ ముఖచిత్రం మన ముందు ఒక తీవ్రమైన ప్రశ్నను నిలబెడుతోంది. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు రాజకీయ అధికారంలో ఎందుకు మైనారిటీగా మిగిలిపోతున్నారు?
నల్గొండ జిల్లాలో గత 16 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే, మొత్తం 194 స్థానాల్లో బీసీలు గెలుచుకున్నవి 19 (9.65%) స్థానాలు మాత్రమే. కానీ, రాష్ట్ర సమగ్ర కుల సర్వే ప్రకారం బీసీల జనాభా 56%. మరి రాజకీయ ప్రాతినిధ్యం కేవలం 9.65%. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బీసీలలో 134 కులాలు ఉన్నప్పటికీ, అసెంబ్లీ గడప తొక్కిన కులాలు నాలుగు మాత్రమే. 130 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 16 ఎన్నికల్లో రెడ్డిలు మొత్తంగా 578 స్థానాల్లో గెలిస్తే, ఒక్క నల్గొండ నుంచే 98 స్థానాల్లో, అనగా 16.95% గెలుపొందారు. వెలమలు 13, బ్రాహ్మణులు 9, కమ్మలు 5, రాజులు 1, వైశ్యులు 1 స్థానాల్లో గెలిచారు. ఆధిపత్య కులాలు 127 స్థానాలు (65.5%) దక్కించుకున్నాయి. మహిళలు గెలిచినవి మొత్తం 13 (6.70%)స్థానాలు. అందులో రెడ్డి మహిళ లు 12 మంది కాగా, బీసీ మహిళ కమల మ్మ యాదవ్ ఒక్కరే నకిరేకల్ నుంచి గెలుపొందారు.
జనాభాలో 11.82% ఉన్న యాదవులకు 8 స్థానాలు (4.1%), 9.55% ఉన్న గౌడలకు 7 స్థానాలు (3.6%), పద్మశాలీలకు 3, కుర్మలకు 1 స్థానం మాత్రమే దక్కింది. మరోవైపు, జిల్లాలో జనాభాపరంగా 10% కూడా లేని కొన్ని ఆధిపత్య కులాలు గత 16 ఎన్నికల్లో సుమారు 65% అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. ఇది కేవలం ఎన్నికల గణాంకం కాదు. ఇది మన ప్రజాస్వామ్యంలో జనాభా, అధికార ప్రాతినిధ్యం మధ్య ఉన్న భారీ అంతరానికి నిదర్శనం.
రాష్ట్రస్థాయిలో పరిస్థితి ఏమిటి?
తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా సుమారు 56.33 శాతం. గత 16 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,741 స్థానాల్లో ఎన్నికలు జరగగా, బీసీలు గెలుచుకున్నవి 277 మాత్రమే. అదే సమయంలో జనాభాలో సుమారు 4.7% ఉన్న రెడ్డి సామాజికవర్గం 578 స్థానాలను, జనాభాలో సుమారు 0.3% ఉన్న వెలమలు 148 స్థానాలు, కమ్మలు 73, బ్రాహ్మణులు 127 స్థానాల్లో గెలిచారు. తక్కువ జనాభా ఉన్న ఆధిపత్య సామాజికవర్గాలు వారి జనా భా నిష్పత్తితో పోలిస్తే అధిక రాజకీయ ప్రాతినిధ్యం పొందాయి. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు ఉండటం వల్ల వారికి నిర్దిష్ట స్థానాల్లో ప్రాతినిధ్యం లభిస్తోంది. కానీ, బీసీల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
జనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ, రాజకీయ అధికారంలో మాత్రం వారి వాటా చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మనం ఇతరులను నిందించడం కంటే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. బీసీలు మెజారిటీ గా ఉండి కూడా అసెంబ్లీలో ఎందుకు మైనారిటీగా ఉన్నారు? బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నా, బీసీలకు సీట్లు ఎందుకు రావడం లేదు? ఓటర్లు మనవాళ్లే అయినప్పుడు, అధికార ప్రతినిధులు ఎందుకు మనవాళ్లు కావ డం లేదు? ఇది అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, మానసిక అంశాల కలయిక.
1. జనాభా బలం ఓటుబలం అధికారబలం కావడం లేదు. బీసీలు సుమారు 56% ఉన్నా, ఎన్నికల సమయంలో బీసీ ఓట్లు అనేక పార్టీలకు, అనేక అభ్యర్థులకు చీలిపోతున్నాయి. అందువల్ల సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్న సమాజం రాజకీయ మెజారిటీగా మారడం లేదు.
2. బీసీ ఓటు కుల ఓటుగా కాకుండా పార్టీ ఓటుగా మారింది. చాలామంది బీసీ ఓటర్లు తమ కులానికి చెందిన అభ్యర్థి కంటే పార్టీ గుర్తు, నాయకుడి వ్యక్తిగత ప్రభావం, స్థానిక సంబంధాలు, సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలను ప్రాధాన్యంగా చూస్తున్నారు. అంటే మన ఓట్లు ఎవరికీ? అనే ప్రశ్న కంటే మన పార్టీ ఏది? అనే ప్రశ్న ముందుకు వస్తోంది.
3. బీసీలలో అంతర్గత విభజన పెద్ద సమస్యగా మారింది. బీసీ అనేది ఒకే కులం కాదు. అనేక వృత్తి, సామాజిక కులాలు కలిసిన విస్తృత వర్గం. ప్రతి కులానికి తన సొంత స్థానిక నాయకత్వం, ప్రయోజనాలు, రాజకీయ అనుబంధాలు ఉన్నాయి. ఈ విభజన కారణంగా 56% జనాభా ఒక రాజకీయ శక్తిగా ఏకీకృతం కావడం కష్టంగా మారింది. కానీ, కొన్ని ఉమ్మడి సమస్యలపైన బీసీలను ఏకం చేయాల్సిన అవసరం ఉంది.
4. ఆధిపత్య కులాలకు ఆర్థిక సామాజిక నెట్‌వర్క్ బలంగా ఉంది. భూమి, వ్యాపారం, విద్య, ఆర్థిక వనరులు, స్థానిక సంస్థలు, రాజకీయ సంబంధాలు వంటి రంగాల్లో చారిత్రకంగా బలమైన సామాజిక నెట్‌వర్క్ ఉన్న వర్గాలకు ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం, ప్రచారం చేయడం, వనరులు సమీకరించడం సులభం. కాబట్టి జనాభా సంఖ్య కంటే సంఘటిత శక్తి ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది.
5. బీసీలకు నాయకత్వం ఉంది; కానీ సమిష్టి రాజకీయ నాయకత్వం తక్కువ. బీసీ సమాజంలో ప్రతిభావంతులైన నాయకులు ఉన్నప్పటికీ, వారిని ఒకే సామాజిక, -రాజకీయ అజెండా చుట్టూ సమీకరించడం జరగకపోవడం ప్రధాన బలహీనత. వ్యక్తిగత నాయకత్వం ఉంది కానీ, సామూహిక బీసీ నాయకత్వం బలహీనంగా ఉంది.
6. మన వాడే గెలవాలనే భావన కంటే గెలిచే వాడికే ఓటు అనే భావన ఎక్కువగా ఉన్నది. ఇది చాలా ముఖ్యమైన మానసిక అంశం. ఒక బీసీ ఓటరు తన వర్గానికి చెంది న అభ్యర్థి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తే, ఓటు వృథా కాకూడద ఆలోచనతో బలమైన అభ్యర్థికి ఓటు వేయవచ్చు. దీంతో ఓటమి భయం వ్యూహాత్మ క ఓటింగ్ ఆధిపత్యవర్గాల అభ్యర్థులకు ప్రయోజనం అనే చక్రం ఏర్పడుతుంది.
7. డబ్బు ప్రభావం అధికంగా ఉండటం. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయగలిగిన వారికి అవకాశాలు పెరగడం, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే మీడియా వేదికలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం, మజిల్ పవర్, రాజకీయ నెట్‌వర్క్, గెలిచే గుర్రాల కు సీట్లు ఇవ్వాలనే రాజకీయ పార్టీల ధోరణి, దీర్ఘకాలంగా ఏర్పడిన రాజకీయ సంబంధా లు, సంస్థాగత బలం, టికెట్ పంపిణీలో అసమానత, బీసీ అభ్యర్థులకు తగిన సంఖ్యలో టికెట్లు దక్కకపోవడం కూడా ప్రధాన కారణాలు.
8. బీసీలలో రాజకీయ ఐక్యత లేకపోవడం, కులాలవారీగా, పార్టీలవారీగా విడిపోయి ఓటువేయడం, నాయకత్వ నిర్మాణంలో లోపం, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని నిరంతరం తయారు చేయకపోవడం. ఓటు విలువపై అవగాహనాలోపం, ఎన్నికల సమయంలో తాత్కాలిక ప్రయోజనాలకు ఓటును ఉపయోగించుకోవడం, దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలను విస్మరించడం.
9. ఓటు చైతన్యం బీసీల రాజకీయ విముక్తికి తొలి మెట్టు. బీసీల రాజకీయ వెనుకబాటుతనానికి ఓటు విలువపై తగినంత అవగాహన లేకపోవడం కూడా ఒక ముఖ్య కార ణం. ఓటు కేవలం హక్కు కాదు, అది అధికారం; మన భవిష్యత్తును నిర్ణయించే ప్రజాస్వామ్య ఆయుధం. బీసీలు తమ ఓటు విలువను గుర్తించి కుల, ప్రాంత, వ్యక్తిగత భేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ఆలోచించాలి. ప్రతి ఎన్నికలో అభ్యర్థి ఎవరన్నదాని కంటే, సామాజిక న్యాయం, బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆయన ఏం చేస్తా రు? అనేది ప్రశ్నించాలి.
ప్రలోభాలకు లోనుకావొద్దు
డబ్బు, కులం, మీడియా ప్రభావం, ప్రలోభాలకు లోబడకుండా ఆలోచించి, స్వేచ్ఛగా, మన భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. ‘ఓట్లు మావేP సీట్లు మావే’ అనేది కేవలం నినాదం కాకుండా, రాజకీయ చైతన్యంగా మారాలి. బీసీ సంఘాలు, మేధావులు, యువత కలిసి ప్రతి గ్రామంలో ఓటు చైతన్య ఉద్యమం చేపట్టాలి. ఓటుతో ప్రతినిధులను ఎన్నుకుందాం. ప్రతినిధులతో హక్కులను సాధించుకుందాం. రాజకీయ ప్రాతినిధ్యంతో సామాజిక న్యాయాన్ని సాధిద్దాం. ఓటు మనది నిర్ణయం మనది! ఓట్లు మావే సీట్లు మావే! హక్కులు మనవి అధికారం మనదే! అనే భావన రావాలి.
మానసిక బానిసత్వాన్ని విడనాడాలి-
బీసీలలోని అనేక కులాలు ‘మన జీవనోపాధి మనకు దొరికితే చాలు’ అనే పరిమిత ఆలోచన నుంచి బయటపడాలి. మన జీవితాలు ఎందుకు మారడం లేదని ఆలోచించాలి. మన వెనుకబాటుతనానికి ప్రధాన కారణాల్లో రాజకీయ అధికారం లేకపోవడం ఒకటి. ఆధిపత్య కులాలకు రాజకీయ అధికారంపై ఎంత కాంక్ష ఉందో, అదే కాంక్ష బీసీలలో కూడా రావాలి. రాజ్యాధికారం ఎవరి దయతోనో వచ్చేది కాదు మన సం ఖ్యాబలం, ఐక్యత, చైతన్యం, పోరాటం ద్వారా సాధించుకోవాల్సింది. మన దగ్గర ఉన్న అతి పెద్ద బలం మన సంఖ్యాబలం. ఆ సంఖ్యాబలాన్ని రాజకీయ శక్తిగా మలచగలిగితే, అధికారం మన చేతుల్లోకి వస్తుంది.
అధికారం మన చేతుల్లో ఉంటే మన జీవితాలకు సంబంధించిన నిర్ణయాలను మనమే తీసుకోగలం; మనకు అవసరమైన చట్టాలు, విధానాలు రూపొందించుకోగలం; మన హక్కులను మనమే కాపాడుకోగలం. అందుకే బీసీలు ముందుగా మానసిక బానిసత్వాన్ని విడనాడాలి. ‘మన ఓటు మన ఆయుధం మన ఓటు మన అధికారానికి పునాది’. ఇకపై ఇతరుల ఆధిపత్యాన్ని అంగీకరించే మనస్తత్వం కాదు; ఆత్మగౌరవంతో జీవించే రాజకీయ చైతన్యం కావాలి. సంఖ్యాబలం మనది చైతన్యం మనది ఐక్యత మనది రాజకీయ అధికారం కూడా మనదే కావాలి!
రిజర్వేషన్లు ఉన్నచోట ఇలా...
ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉన్నందున వారి ప్రతినిధిత్వానికి ఒక సంస్థాగత రక్షణ ఉంది. బీసీలకు సాధారణ అసెంబ్లీ స్థానాల్లో అలాం టి నియోజకవర్గ రిజర్వేషన్ లేకపోవడంతో, వారికి ప్రాతినిధ్యం లేకుండాపోయింది. అందుకే చట్టసభలలో వారికి రిజర్వేషన్లు కావాలి.
కొత్త శక్తి జెన్ జీ యువత
మీ చేతిలోని మొబైల్ ప్రపంచాన్ని మీ గుప్పెట్లోకి తెచ్చింది. కొన్ని సెకన్లలో ప్రపంచంలోని ఏ విషయాన్నైనా తెలుసుకోగలుగుతున్నారు. కానీ, మన సమాజాన్ని మనం తెలుసుకుంటున్నామా? మన పూర్వీకులు ఎవరు? వారి వృత్తులు ఏమిటి? మనం ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎందుకు వెనుకబడ్డాం? మన చరిత్ర, సంస్కృతి, శ్రమ కు తగిన గుర్తింపు ఎందుకు రాలేదు? జెన్ జీ ముందుగా మన పరిస్థితి ఏమిటి? అని తెలుసుకోవాలి. తర్వాత ఇలా ఎందుకు జరిగింది? అని ప్రశ్నించాలి. చివరగా దీన్ని ఎలా మార్చాలి? అని ఆలోచించాలి.
మన వెనుకబాటుతనం ఒక్క రోజులో ఏర్పడలేదు. తరతరాలుగా విద్యకు దూరం, వనరుల అసమానత, ఆర్థిక అవకాశాల కొరత, రాజకీయ ప్రాతినిధ్య లోపం వంటి సమస్యలు పేరుకుపోయాయి. అందుకే డేటాను తెలుసుకోండి, చరిత్రను తెలుసుకోండి, రాజ్యాంగాన్ని చదవండి. రాజకీయంగా ఒక ప్రశ్న తప్పక అడగాలి: మన ఓటు ఎవరిని గెలిపిస్తోంది? మన ఓటు మనకు ఎంత ప్రాతినిధ్యం తెస్తోంది? జనాభా బలం ఓటుబలం రాజకీయ ప్రాతినిధ్యం నిర్ణయాధికారంగా మారాలి.
విద్య మన మొదటి ఆయుధం. విద్య ఉద్యోగం కోసం మాత్రమే కాదు; ప్రశ్నించడానికి, హక్కులను తెలుసుకోవడానికి, తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవడానికి కూడా. మన పూర్వీకుల వృత్తులు చిన్నవి కావు. వారి శ్రమతోనే సమాజం నిర్మింతమైంది. కాబట్టి జెన్ జీ మన గ్రామాల చరిత్రను, వృత్తుల చరిత్రను, పూర్వీకుల పోరాటాలను నమోదు చేసి ప్రపంచానికి తెలియజేయాలి.
సామాజిక న్యాయం ఎవరి మీద ద్వేషం కాదు, అది అవకాశాల్లో సమానత్వం, ప్రాతినిధ్యంలో న్యాయం, గౌరవంలో సమానత్వం, అభివృద్ధిలో భాగస్వామ్యం. జెన్ జీ యువత ద్వారానే మార్పు సాధ్యం. అవకాశాలను అందిపుచ్చుకోండి. అన్యాయాన్ని ప్రశ్నించండి. రాజ్యాంగ విలువలను కాపాడండి. సామాజిక న్యాయం కోసం నిలబడండి. సమాజానికి మార్గనిర్దేశకులుగా ఎదగండి.
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్
టి.చిరంజీవులు






