11 August, 2026 | 4:05 AM

డిజిటల్ ఇండియాకు సవాల్

11-08-2026 12:00 AM

భారతదేశం గత దశాబ్దంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి స్మార్ట్‌ఫోన్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ వైపు దేశాన్ని మలిచిన ప్రధాన శక్తి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్). టీ దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు, కూరగాయల వ్యాపారి నుంచి కార్పొరేట్ ఆసుపత్రి వరకు ప్రతి చోట యూ పీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి.

దీనికి ప్రధాన కారణం.. ఉచిత లావాదేవీలు, వేగవంతమైన సేవ, సులభమైన వినియోగం. అయితే, కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ‘పన్నులు, ఇతర చట్టాలు (సవరణ) బిల్లు ఉన్న యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)’ ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే, సామాన్య వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని, ఎండీఆర్‌ను వ్యాపారులే చెల్లిస్తారని ప్రభుత్వం చెబుతున్నది. కానీ, వాస్తవ పరిస్థితులు, మార్కెట్ స్వభావం పరిశీలిస్తే ఈ హామీపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఉచితంగా నడవదు. ప్రతి లావాదేవీ వెనుక బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు, నెట్‌వర్క్ సంస్థలు, సాంకేతిక మౌలిక వసతులు పని చేస్తాయి. వీటికి అయ్యే ఖర్చును భర్తీ చేయడానికి వ్యాపారులు చెల్లించే రుసుమే ఎండీఆర్. ఈ రుసుములో ఇంటర్‌ఛేంజ్ ఫీజు, పేమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు, నెట్‌వర్క్ ఫీజులు, పన్నులు వంటి అంశాలు ఉంటాయి.

ప్రభుత్వం వాదనలో కొంత వాస్తవం ఉంది. యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. ఈ భారీ వ్యవస్థను నిర్వహించడానికి బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నా యి. కానీ, యూపీఐపై ఎండీఆర్ లేకపోవడంతో వాటికి ప్రత్యక్ష ఆదాయం రావడం లేదు. ప్రభుత్వ సబ్సిడీ సరిపోవడం లేదని బ్యాంకులు, చెల్లింపు సంస్థలు చాలాకాలంగా వాదిస్తున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలంటే స్థిరమైన ఆదాయ వనరు అవసరమని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎండీఆర్‌ను తిరిగి ప్రవేశపెట్టే దిశగా చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది.

ప్రభుత్వం ప్రకారం వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) జరిగే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అలాగే చిన్న వ్యాపారులకు కూడా ఈ భారం ఉండదని చెబుతోంది. రూ.1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపార సంస్థల్లో రూ.2 వేలకు మించిన లావాదేవీలపైనే ఎండీఆర్ వర్తించే అవకాశముందని సమాచారం. ఈ ప్రకటన వినడానికి హామీలా అనిపించినా, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో వ్యాపారు లు భరించే అదనపు ఖర్చు చివరికి వినియోగదారుడిపైనే పడటం సహజం. వ్యాపార సంస్థలు వస్తువుల ధరల్లో స్వల్ప పెంపు ద్వారా ఆ భారాన్ని పరోక్షంగా వినియోగదారుడిపై మోపే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్నిచోట్ల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. అదే విధానం యూపీఐ విషయంలోనూ కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం ప్రతిపాదనలు పెద్ద వ్యాపారాలకే పరిమితమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఒకసారి ప్రభుత్వం ఎలాంటి లావాదేవీలపైనా ఛార్జీలు విధించే అధికారం పొందితే, భవిష్యత్తులో ఆ పరిధి విస్తరించే అవకాశా న్ని పూర్తిగా తోసిపుచ్చలేం. ఇది చిన్న వ్యాపారుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

అయితే, ఎండీఆర్‌ను ప్రవేశపెట్టడం వల్ల కొంతమంది వ్యాపారులు నగదు లావాదేవీలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. ముఖ్యంగా అధిక విలువ కలిగిన కొనుగోళ్లలో యూపీఐకి బదులుగా నగదు లేదా ఇతర మార్గాలను ప్రోత్సహిస్తే, డిజిటల్ చెల్లింపుల పెరుగుదల కొంత మందగించే ప్రమాదం ఉంది. మరోవైపు చెల్లింపు సంస్థలకు ఆదాయం లేకుండా ఈ వ్యవస్థను దీర్ఘకాలం కొనసాగించడం కష్టమే. అందువల్ల ఎండీఆర్‌కు పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం కంటే, అది ఎలా అమలు అవుతుందనేదే ముఖ్యమైన అంశం.

ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. మొదటిది, ఎండీఆర్ ఏ లావాదేవీలకు వర్తిస్తుందో స్పష్టంగా ప్రకటించాలి. తరచూ మార్పులు చేస్తూ అనిశ్చితి సృష్టించకూడదు. రెండవది, వ్యాపారులు ఎండీఆర్ పేరుతో వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు చేయకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలి. మూడవది, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలకు ఎండీఆర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని నిజంగానే సైబర్ భద్రత, మౌలిక సదుపాయాల విస్తరణ, సేవల నాణ్యత పెంపు కోసం వినియోగిస్తున్నాయా? అనే అంశంపై పర్యవేక్షణ ఉండాలి.

డిజిటల్ చెల్లింపుల విస్తరణ, బ్యాంకుల ఆర్థిక స్థిరత్వం, వినియోగదారుల ప్రయోజనాలు ఈ మూడు లక్ష్యాల మధ్య సమతుల్యత సాధించడం ప్రభుత్వానికి పెద్ద సవాలు. ‘ఉచిత యూపీఐ’ అనే భావన భారతీయుల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. ఆ విశ్వాసాన్ని కాపాడుతూ, అవసరమైన సంస్కరణలను పారదర్శకంగా అమలు చేయగలిగితేనే ఈ మార్పు విజయవంతమవుతుంది.

 వ్యాసకర్త: జర్నలిస్టు, 6300560191

-జి.శ్రీలత