calender_icon.png 8 December, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి

09-12-2025 01:05:00 AM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉండే పోలింగ్ విధులను ప్రిసైడింగ్ అధికారులు (పీ.ఓలు) సమర్ధవం తంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పీ.ఓలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. సాలూర మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు మలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు.

శిక్షణ తరగతులను సందర్శించిన కలెక్టర్ పోలింగ్ విధులకు సంబంధించి కీలకమైన సూచనలు చేశారు.  నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం కల్పించకూడదని సూచించారు. సమయ పాలనను పాటిస్తూ, సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. మొదటి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనున్న దృష్ట్యా, 10వ తేదీ ఉదయం 8.00 గంటల సమయానికే దిస్త్రిబ్యుషన్ సెంటర్లకు చేరుకుని, పోలింగ్ మెటీరియల్ ను తీసుకోవాలని అన్నారు.

చెక్‌లిస్టుకు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రి ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అనంతరం డిస్త్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ స్టేషన్ కు చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను చక్కబెట్టుకోవాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. సీటింగ్ అరేంజ్ మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. 

ఓటరు ఐ.డీ, ఆధార్ కార్డులే కాకుండా ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటరు ఓటు వేయవచ్చని తెలిపారు.  ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్బుక్ను ప్రతీ పీఓ క్షుణ్ణంగా చదివి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, పోలింగ్ విధుల సందర్భంగా అన్ని నిబంధనలను పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు.

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను యధాతథంగా అమలు చేయాలే తప్ప, సొంత నిర్ణయాలకు తావు కల్పించకూడదని హితవు పలికారు. ఎన్నికల విధులలో అనవసర పొరపాట్లకు ఆస్కారం కల్పిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా జరిగి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా పూర్తయ్యేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని పీ.ఓలకు సూచించారు. కాగా, పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు వివరాల ప్రకటనలో తొందరపాటు ప్రదర్శించ కూడదని, పక్కాగా నిర్ధారణ చేసుకున్న తరువాతనే ఓటింగ్ శాతాన్ని, కౌంటింగ్ వివరా లను వెల్లడించాలని సూచించారు. ఇదిలాఉండగా, మోస్రా మండల కేంద్రంలో పీ.ఓల కు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ.వీ.శ్యాంప్ర సాద్ లాల్ పాల్గొని సూచనలు చేశారు. శిక్షణ తరగతుల్లో స్థానిక అధికారులు, స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

కలెక్టర్, అబ్జర్వర్ సమక్షంలో..

నిజామాబాద్, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెండవ విడత ఎన్నికలు జరుగ నున్న మండలాల పోలింగ్ సిబ్బంది మలి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో నిర్వహించారు ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు.

నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లోని ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడం వల్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ నుండి మినహాయింపు కల్పించారు.

స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు.  రెండవ విడతలో 1476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరుగనుండగా, 20 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్ లో ఉంచుతూ ర్యాండమైజేషన్ జరిపారు.