26 August, 2026 | 3:39 AM

శక్తివిహీనంగా పాలిటెక్నిక్ విద్య

26-08-2026 12:00 AM

అమర్‌నాథ్ సారంగుల :

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. 103 సంవత్సరాల చరిత్ర గల పాలిటెక్నిక్ విద్యను ఇప్పటివరకు కనీసం సంవత్సరం కూడా పూర్తిచేసుకోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలపడం తుగ్లక్ పాలన కాకుంటే, మరేమిటి? అనే ప్రశ్న మేధావి వర్గం నుంచి వస్తున్నది. పాలిటెక్నిక్ విద్యలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయాలి కానీ పేద, గ్రామీణ విద్యార్థులకు అద్భుతమైన కెరీర్‌ను అందిస్తున్న పాలిటెక్నిక్ విద్యను నాశనం చేస్తామంటే ఎలా?

తెలంగాణలో పాలిటెక్నిక్ విద్య నిన్న మొన్న పుట్టిన వ్యవస్థ కాదు. నిజాం కాలంలో 1923లో ప్రారంభమై, వందేళ్లకు పైగా లక్షలాది మంది టెక్నీషియన్లు, జూనియర్ ఇంజినీర్లు, పారిశ్రామిక నిపుణులను తయారుచేసిన చారిత్రక సాంకేతిక విద్యావ్యవస్థను, 103 సంవత్సరాల అకడమిక్ వారసత్వాన్ని ఒకే ఒక్క జీవోతో సాధారణ స్కిల్ ట్రైనింగ్ పరిధిలోకి నెట్టడం సంస్కరణ కాదు, అది- చరిత్రను చెరిపివేయడమే.

వీధుల్లోకి పాలిటెక్నిక్ విద్యార్థులు 

తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి, రహదారులపై బైఠాయించి, ‘జీవో 97 రద్దు చేయాలి’,-‘పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలి’ అని ఎందుకు నినదిస్తున్నారు? అనే ప్రశ్న ఈ సందర్భంగా ఉదయిస్తున్నది. అయితే, విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాలు ఇంత తీవ్రంగా ఆందోళన చెందుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారితో కనీసం మాట్లాడే ప్రయత్నం చేయట్లేదంటే అందుకు కారణం అహంకారామా? అవగాహనారాహిత్యమా? అన్నది పాలకులు ప్రశ్నించుకోవాలి.

కాగా, 2026 జూలై 3న ప్రభుత్వం జీవో నంబర్ 97ను జారీ చేసింది. దాని ద్వారా కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖను శక్తి (స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్‌గా పునర్వ్యవస్థీకరించి, ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలను ఒకే నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఈ సంస్థలను అనుసంధానించాలని చూస్తున్నది. దీనిపైనే ప్రధానంగా విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిని ‘ఉపాధికి అనుగుణమైన సంస్కరణ’గా చూపవచ్చు. కానీ, స్కిల్ డెవలప్‌మెంట్ అవసరమనే పేరుతో ఒక సంపూర్ణ సాంకేతిక విద్యావ్యవస్థ అకడమిక్ గుర్తింపును రూపుమాపే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు?

డిప్లొమా అంటే ఐటీఐ కాదు

పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటీఐ రెండూ సాంకేతిక, వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులే. అయినప్పటికీ వాటి లక్ష్యం, పాఠ్యప్రణాళిక, విద్యాస్థాయి, ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యకు కొనసాగింపు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పదో తరగతి తరువాత చదివే పాలిటెక్నిక్ డిప్లొమా సాధారణంగా మూడేళ్ల సమగ్ర సాంకేతిక విద్యా కోర్సు. ఇందులో ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ సైన్స్, ఇంజినీరింగ్ డ్రాయింగ్, డిజైన్, కంప్యూటర్ అప్లికేషన్స్, కోర్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు, ల్యాబొరేటరీ ప్రాక్టికల్స్, ప్రాజెక్టులు, పారిశ్రామిక శిక్షణ తదితర అన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి.

ఇది విద్యార్థిని కేవలం ఒక పని చేయగల కార్మికుడిగా కాకుండా, సాంకేతిక సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించగల మధ్యస్థాయి ఇంజినీరింగ్ నిపుణుడిగా తీర్చిదిద్దుతుంది. ఈసెట్ ద్వారా బీటెక్ రెండో సంవత్సరంలో చేరే ప్రత్యక్ష అవకాశమూ కల్పిస్తుంది.

ఐటీఐ కోర్సులు ఒకటి లేదా రెండేళ్లలో ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మెకానిక్ వంటి నిర్దిష్ట ట్రేడ్లలో ఆచరణాత్మక నైపుణ్యాలను అందిస్తాయి. పరిశ్రమలకు నైపుణ్య కార్మికులను తయారుచేయడంలో ఐటీఐల పాత్ర కీలకమైనదే. అయితే ఐటీఐ వృత్తి శిక్షణను డిప్లొమా ఇంజినీరింగ్ విద్యకు ప్రత్యామ్నాయంగా చూడలేం. వేర్వేరు లక్ష్యాలతో ఏర్పడిన ఈ రెండు వ్యవస్థలను ఒకే పరిపాలనా పథకంలో కలపడం ఏ మాత్రం సంస్కరణ కాదు. ఇది ముమ్మాటికీ- విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను సంకుచితం చేయడమే.

విద్యార్థుల అసలు భయం-

డిప్లొమా అనేది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ‘చిన్న కోర్సు’ మాత్రమే కాదు. పదో తరగతి తరువాత మూడేళ్ల సాంకేతిక విద్య చదివి, ఉద్యోగం పొందడానికి లేదా ఈసెట్ ద్వారా బీటెక్ రెండో సంవత్సరంలో చేరడానికి ఉపయోగపడే ప్రత్యామ్నాయ విద్యా రహదారి.

అయితే జీవో 97 అమల్లోకి వచ్చాక స్టేట్ బోర్ట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ భవితవ్యం, డిప్లొమా భవిష్యత్తు, ఏఐసీటీఈ అనుసంధానం, ఈసెట్ కొనసాగింపు, రాబోయే రోజుల్లో డిప్లొమా పూర్తిచేసే విద్యార్థుల అకడమిక్ పురోగతిపై స్పష్టమైన, చట్టపరమైన హామీ కనిపించడం లేదనే ఆందోళన విద్యార్థుల్లో ఉంది. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నది. ప్రభుత్వం ‘ఏమీ జరగదు’ అని మౌఖికంగా చెప్పడం సరిపోదు. జీవోలోనే ఈ విషయాలను స్పష్టంగా పేర్కొనాలి.

1. పాలిటెక్నిక్ కోర్సులు డిప్లొమాలుగానే కొనసాగుతాయా? 2. ఎస్‌బీటీఈటీ అధికారాలు యధాతథంగా ఉంటాయా? 3. ఏఐసీటీఈ అనుమతులు, ప్రమాణాలు మారవా? 4. ప్రతి డిప్లొమా విద్యార్థికి ఈసెట్, లేటరల్ ఎంట్రీ హక్కు కొనసాగుతుందా? 5. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిప్లొమా అర్హత కొనసాగుతుందా? 6. ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ విధానం మారదా? 7. పీపీపీ వ్యవస్థలోకి వెళ్లినా ప్రభుత్వ కళాశాలల ఆస్తులు, అధ్యాపక పోస్టులు, విద్యార్థుల హక్కులకు రక్షణ ఉంటుందా? ఈ ప్రశ్నలకు జీవోలో స్పష్టమైన సమాధానం లేకుండా వ్యవస్థను మార్చడం అంటే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రయోగం చేయడమే.

ప్రభుత్వం చేయాల్సింది ఇదే

తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేనందువల్లనో లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యాశాఖ పట్ల అవగాహనారాహిత్యం వల్లనో ఇప్పటికే విద్యాశాఖలో కెమిస్ట్ ల్యాబ్‌లో జరిగినన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఇప్పటికే రోడ్డెక్కుతున్న విద్యార్థులు ఇప్పుడు పాలిటెక్నిక్ విద్య రద్దు చేస్తారనే వార్తలతో ఇంకా కుంగిపోతున్నారు. ఒకవేళ పాలిటెక్నిక్ సిలబస్ పాతదనుకుంటే ఆధునీకరించాలి.

ఏఐ, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఈవీ టెక్నాలజీ, డ్రోన్లు, త్రీడీ ప్రింటింగ్, సీఎన్‌సీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, గ్రీన్ ఎనర్జీ కోర్సులు తీసుకురావాలి. ప్రతి విద్యార్థికి పరిశ్రమ ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్, ప్లేస్‌మెంట్ సహాయం కల్పించాలి. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. ల్యాబ్‌లను ఆధునీకరించాలి. అంతేతప్ప, పాలిటెక్నిక్‌ల అకడమిక్ గుర్తింపును తీసివేయాల్సిన అవసరం లేదు.

ప్రభుత్వం వెంటనే జీవో 97 అమలును నిలిపివేసి, విద్యార్థులు, అధ్యాపకులు, ఎస్‌బీటీఈటీ, ఏఐసీటీఈ నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు, తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపాలి. పాలిటెక్నిక్‌లను టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోనే ఉంచుతూ, శక్తి శాఖతో సమన్వయ ఒప్పందాన్ని రూపొందించవచ్చు. పరిశ్రమ శిక్షణను శక్తి అందించవచ్చు. అదే సమయంలో డిప్లొమా అకడమిక్ నియంత్రణ మాత్రం టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు వద్దనే ఉండాలి.

విద్యార్థుల గొంతును పోలీసులతో ప్రభుత్వం అడ్డుకోవడం కాదు, వారి ఆందోళనను ప్రజాస్వామ్యబద్ధంగా వినాలి. పాలిటెక్నిక్ విద్యను ప్రయోగశాలగా, విద్యార్థుల భవిష్యత్తును ప్రయోగ వస్తువుగా మార్చకూడదు. అంతేకాదు ఈసెట్, లేటరల్ ఎంట్రీ, డిప్లొమా గుర్తింపు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ ఉద్యోగాల అర్హత, అధ్యాపకుల సేవా నిబంధనలు మారవని ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

 వ్యాసకర్త: బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, 8074162333