వ్యవసాయశాఖ అధ్యక్షుని బాధ్యతలు
పాలకుర్తి రామమూర్తి :
సీతాధ్యక్షః కృషితం
త్రశుల్బవృక్షాయుర్వేదజ్ఞః
తద్ జ్ఞసఖో వా సర్వ ధాన్య
పుష్ప ఫల శాక
కందమూల వాల్లిక్య క్షౌమకార్పాస
బీజాని యథాకాలం గృహ్ణీయాత్!
(కౌటిలీయం-2-24)
సీతాధ్యక్షుని అర్హతలు, బాధ్యతలను చెపుతున్నాడు, ఆచార్య చాణక్య. సీతాధ్యక్షుడు అంటే వ్యవసాయశాఖ అధ్యక్షుడు. సీతాధ్యక్షుడు కృషిశాస్త్రాన్ని (వ్యవసా యం), శుల్బశాస్త్రాన్ని (భూగర్భ జలశాస్త్రం), వృక్షశాస్త్రాన్ని, ఆయుర్వేద శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలాగే ‘తద్ జ్ఞసఖో వా’ అనడంలో సీతాధ్యక్షుడు తనకున్న జ్ఞానం, అనుభవాలకే పరిమితం కాకూడదు..
అవసరం మేరకు ఆయా శాస్త్రాలలో నైపుణ్యం, అనుభవం కలిగిన నిపుణుల సహాయాన్ని తీసుకొని పుష్ప, ఫల, శాక, కంద, మూలబీజాలు, తీగలకు కాసే గుమ్మడి మొదలైన వాటి బీజాలు, క్షౌమం (నారచీరలు) తీసే బీజాలు, పత్తి బీజాలు.. మొదలైన బీజాలను, ఆయా ఋతువులలో తగిన సమయాలలో సేకరించి, రైతులకు అందించాలి.
బీజాలు అంటే విత్తనాలు. ఇది వ్యవసాయ శాఖ అధ్యక్షుని ప్రధాన బాధ్యత. సీతాధ్యక్షుడు పంట పండించేందుకేపరిమితం కాకుండా.. వ్యవసాయ ఫలితాన్ని సాధించేందుకు అవసరమైన సహజ వనరులన్నింటినీ సమన్వయం చేసుకొని సకాలంలో స్పందించాలి. పంటకు ఆధారమైన భూమి స్వభావం, నీటి లభ్యత, పంట స్వభావం, తగిన ఋతువులు, విత్తనాల నాణ్యత.. ఇవన్నీ పరస్పర సంబంధం కలిగినవిగా సీతాధ్యక్షుడు, అవగాహన చేసుకోవాలి.
ఒక పంటను సకాలంలో సాగుచేయాలంటే విత్తనం సిద్ధంగా ఉండటమే సరిపో దు. ఆయా విత్తనాలను ఆయా పంటలకు అనువైన నేలలలో నాగళ్లతో దున్నించి విత్తించాలి. ఆయా పనులకు అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులతో పాటుగా దండప్రతికర్తలను (దండనకు గురైన అపరాధులను) కూడా వ్యవసాయ కార్యకలాపాల్లో వినియోగించాలి.
అలాగే విత్తనాలను చల్లేవారికి సహాయంగా దున్నే యంత్రాలను, తాళ్లు, కొడవళ్లు మొదలైన ఉపకరణాలను, ఎద్దులను, అవసరమైతే శిల్పులను, కమ్మరులను, వడ్రంగులను, తట్టలను అల్లేవారిని, తాళ్లుపేనేవాళ్లను నియమించి విత్తనాలను చల్లేవారి పనులకు అంతరాయం కలుగకుండా చూడాలి. ముఖ్యంగా విత్తనాలను చల్లేవారికి పాము లతో ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి పాములను పట్టుకునే వారిని అందుబాటులో ఉంచాలి, అంటున్నాడు ఆచార్య చాణక్య.
వీటిలో ఏ ఒక్కటి సకాలంలో రైతుకు అందకపోయినా సాగు ప్రక్రియలో ఆలస్యం ఏర్పడి పంట దిగుబడిపై ప్రభావం చూపవచ్చు. ఒకవేళ ఎవరైనా తమ పనిని సకాలంలో చేయకపోవడం వల్ల నష్టం వాటిల్లితే ఎంత నష్టం జరుగుతుందో దానికి సమానమైన మూల్యాన్ని ఆయా వ్యక్తుల వద్ద దండనగా వసూలు చేయాలని చాణక్య చెపుతున్నాడు. దీన్ని బట్టి వ్యవసాయం అనేది ఒక్క రైతు చేసే ప్రక్రియ కాదు. అనేక సహాయక వ్యవస్థల సమన్వయంతో పరస్పరాధారిత విధానంలో జరగాల్సిన ప్రక్రియగా చాణక్యుడు గుర్తించిన విధానం కనిపిస్తుంది.
వ్యవసాయం వల్ల ఆహార భద్రత, సంపద సృష్టి జరుగుతుంది. రాజ్యం అభ్యుదయంలో ఈ రెండూ ప్రధాన భూమికలను పోషిస్తాయి. అంతేకాదు విత్తనం సకాలంలో విత్తకపోతే ఫలితం రాదు, వచ్చినా రావలసినంతగా రాదు. వ్యవసాయం బలంగా ఉంటేనే ఆహారం లభిస్తుంది, ఆహార భద్రత నిలిస్తేనే ప్రజలు స్థిరంగా ఉంటారు, వాణిజ్యం వికసిస్తుంది, విస్తరిస్తుంది. ప్రజలకు ఉపాధి లభిస్తుంది.
పన్నుల ద్వారా కోశానికి ఆదాయం పెరుగుతుంది, తద్వారా రాజ్య ఆర్థిక శక్తి పెరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ సులభతరమౌతుంది. ఈ ప్రక్రియలో సీతాధ్యక్షుని అసమర్థత కేవలం ఒక శాఖ వైఫల్యంగా కాకుండా మొత్తం రాజ్య ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా భావించాలి.
సీతాధ్యక్షుని అసమర్థత రాజ్య ప్రగతికి అంతరాయం కాకూడదు. కాబట్టి బాధ్యతా నిర్వహణలో అలసత్వం చూపే అధ్యక్షునికీ దండనను విధించాలంటాడు, చాణక్య. అందువల్ల, చాణక్య వ్యవసాయాన్ని కేవలం రైతు వ్యక్తిగత వృత్తిగా కాకుండా, రాజ్య ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యవస్థీకృత ప్రభుత్వ బాధ్యతగా గుర్తించినట్లుగా భావించాలి.
ఈనాటి వ్యవసాయశాఖ, విత్తన సంస్థ, సాగునీటి విభాగం, వ్యవసాయ విస్తరణ వ్యవస్థ, విపత్తు నిర్వహణ విభాగం.. లాంటి పలు విభాగాల సమన్వయ బాధ్యతలు ఆనాటి సీతాధ్యక్షుని బాధ్యతలుగా కనిపిస్తున్నాయి. సీతాధ్యక్షునికి వ్యవసాయ శాస్త్రంతో పాటు భూమి, నీరు, వృక్షజ్ఞానం, ఔషధజ్ఞానం ఉండాలని చెప్పడం ద్వారా కౌటిల్యుడు వ్యవసాయాన్ని వివిధ శాస్త్రాల సమన్వయంతో కూడిన వ్యవస్థీకృత రంగంగా గుర్తించారని భావించవచ్చు.
‘యథాకాలం గృహ్ణీయాత్’ అంటే తగిన కాలంలో, సరైన పంటలను, సరైన నాణ్యతా ప్రమాణాలతో, సరైన నేలలో, అనువైన సమయంలో విత్తకపోతే ఉత్పత్తి ఉత్పాదకతలు దెబ్బతింటాయి. కాబట్టి సీతాధ్యక్షుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చాణక్య అభిప్రాయం.
వ్యక్తిగత జ్ఞానానికి పరిమితులు ఉంటాయి. కాబట్టి సంబంధిత రంగంలో అనుభవం కలిగిన నిపుణుల సహాయాన్ని తీసుకొని ముందుకుసాగిన అధ్యక్షుడు సమర్థవంతమైన ఫలితాలను సాధించగలడు. నిజానికి అదే సమర్థ పరిపాలనకు గీటురాయి.
సకాలంలో విత్తనాల సేకరణ, సకాలంలో సాగు ప్రక్రియ నిర్వహణ వ్యవసాయ రంగానికి సంబంధించిన సాధారణ అంశాలుగా మాత్రమే చూడకుండా... రాజ్య ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం, సంపద సృష్టికి సంబంధించిన ప్రధాన బిందువులుగా లేదా మౌలిక అంశాలుగా చాణక్య గుర్తించారని భావించవచ్చు. అందుకే సరైన కాలంలో, సరైన భూమిలో, సరైన వనరులతో సాగు చేయించి, ప్రక్రియలో ఏర్పడే అడ్డంకులను తొలగించి, వైఫల్యాలకు సంబంధిత అధికారిని బాధ్యుని చేయడం వల్ల సత్ఫలితాలు సాధించడం సాధ్యమని ఆయన భావన.
‘యథాకాలం గృహ్ణీయాత్’ అనే పదబంధం ప్రధానంగా విత్తనాలను తగిన కాలంలో సేకరించడం, విత్తడం వంటి కార్యాల అవసరాన్ని సూచిస్తుంది. ఏ రంగంలోనైనా, ఏ కాలంలోనైనా సమయాన్ని పాటించడం లేదా కాలానుగుణంగా స్పందించడం ఉత్తమ ఫలితాన్ని అందిస్తుంది.
అయితే వ్యవసాయ ప్రక్రియ మొత్తాన్ని పరిశీలించినప్పుడు సరైన విత్తనం, అనుకూలమైన నేల, తగిన ఋతువు, అవసరమైన వనరులు, సమయపాలన.. ఇవన్నీ ఉత్పాదకతను ప్రభావితం చేసే పరస్పర సంబంధిత అంశాలుగా చాణక్యుని వ్యవసాయ నిర్వహణలో కనిపిస్తాయి. చాణక్య సూచనలో ప్రత్యక్షంగా లేకపోయినా పంటకు అవసరమైన ఎరువుల సరఫరా, సాగునీటి వ్యవస్థ, రక్షణ కల్పించడం కూడా పంట దిగుబడిని ప్రభావితం చేస్తాయని భావించవచ్చు.






