15-11-2025 12:24:46 AM
బాలీవుడ్ చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి కామిని కౌశల్ (98) కన్నుమూశారు. కొంతకాలంగా అనారో గ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ముంబయిలో తుదిశ్వాస విడిచారు. లాహోర్‌లో జన్మించిన కామిని అసలు పేరు ఉమా కశ్యప్. ఏడేళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయిన ఆమె చిన్నప్పట్నుంచి కళలపై ఉన్న ఆసక్తి కనబర్చేది.
బాల్యంలోనే తోలుబొమ్మ థియేటర్ రూపొందించి, ఆల్ ఇండియా రేడియోలో నాటకాలు ప్రదర్శించడం ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆమె కంఠస్వరం, నటనకు ముగ్ధుడైన దర్శకుడు చేతన్ ఆనంద్.. ఆమెకు తన భార్య పేరు (ఉమా ఆనంద్)ను కలిపి ‘ఉమా కామిని’గా, తర్వాత ‘కామిని కౌశల్’గా పేరు మార్చారు.
ఆ తర్వాత ఆ పేరుతోనే ఆమె బాలీవుడ్‌లో స్థిరీకృతమైంది. 1940 60 దశకాల్లో కామిని కౌశల్ బాలీవుడ్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించారు. ఆమె నటించిన చిత్రాల్లో బిరాజ్ బహు (1954), ఆర్జూ (1950), షబ్నం (1949), జిద్ది (1948), ఆగ్ (1948), నదియా కే పార్ (1948), షహీద్ (1948) వంటి ఎన్నో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.