7 April, 2026 | 3:05 AM

‘నివృత్తి’తో సత్ఫలితాలు

07-04-2026 12:54 AM
  1. గవర్నర్ శివప్రతాప్ శుక్లా

ఖైదీల పరివర్తనకు జైళ్లు పునరావాస కేంద్రాలుగా మారాలి

కుషాయిగూడ, ఏప్రిల్ 6(విజయక్రాంతి): కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని మత్తు వ్యసనాల నుంచి దూరం చేసి, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పా టు చేసిన ‘నివృత్తి’ వ్యసన విముక్తి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సోమవారం ప్రారంభించారు.రాష్ట్ర కారాగారాల శాఖ సం చాలకులు డాక్టరు సౌమ్య మిశ్రా గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మత్తు పదార్థాల దుర్వినియోగం అనేది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదని, అది ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య అని పేర్కొన్నారు.దీనిని సమగ్రంగా, శాస్త్రీయ పద్ధతిలో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మత్తు రహిత భారత అభియాన్’ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ కారాగార శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని గవర్నర్ కొనియాడారు.

చంచల్‌గూడ, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్‌తో పాటు మహిళా కారాగారాల్లోనూ ఈ ‘నివృత్తి’ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డాక్టరు సౌమ్య మిశ్రా నాయకత్వంలో జరుగుతున్న సంస్కరణలు కారాగారాల రూపురేఖలను మారుస్తున్నాయ ని ప్రశంసించారు. కారాగారాల శాఖ సంచాలకులు డాక్టరు సౌమ్య మిశ్రా వ్యసన విముక్తి కేంద్రాల పనితీరును వివరించారు.

ఇప్పటివరకు 2,915 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వ హించగా, తీవ్రమైన వ్యసన స్థితిలో ఉన్న 590 మందిని గుర్తించి వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.అనంతరం గవర్నర్ చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ క్షేత్రాన్ని (పీఏసీ) సందర్శించారు. అక్కడ ఖైదీలు సాగు చేస్తున్న సేంద్రియ పంటలు, తేనెటీగల పెంపకాన్ని తిలకించి వారితో ముచ్చటించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ‘ఏరియా 77’ సాహస క్రీడల ప్రాంగణాన్ని సం దర్శించి, అక్కడ మాజీ ఖైదీలకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, వికలాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు బి. శైలజ, ఉప్పల్ ప్రాంత ఉప పోలీసుకమిషనర్ కె. సురేష్ కుమార్, కారాగారాల శాఖ ఐజీ మురళీబాబు, డీఐజీ డి.శ్రీనివాస్, సూపరింటెం డెంట్లు పాల్గొన్నారు.