ఆప్, బీజేపీ మధ్య పోస్టర్ వార్
- కేజ్రీవాల్‌ను పెద్ద మోసగాడిగా అభివర్ణించిన బీజేపీ
కౌంటర్‌గా గోట్ పోస్టర్ విడుదల చేసిన ఆప్
న్యూఢిల్లీ, జనవరి 2: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడకముందే ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బుధవారం ఒకరిపై మరొకరు లేఖాస్త్రాలు సంధించుకుని పరస్పర ఆరోపణలు చేసుకున్న ఆప్, బీజేపీలు.. గురువారం సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేసి విమర్శలు గుప్పించుకున్నాయి. ముందు గా ‘స్కాం 2024’ టైటిల్‌తో కేజ్రీవాల్ ఫొటోతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసిన బీజేపీ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది.
కేజ్రీవాల్ ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాకుండా ఆయనను పెద్ద మోసగాడిగా అభివర్ణించింది. ఢిల్లీలో కేజ్రీవాల్ కొత్త ఆటను ప్రారంభించారని.. ఓట్లను రిగ్గింగ్ చేయడం ద్వారా అధికారాన్ని కాపాడుకునే ప్రతయ్నం చేస్తున్నారని విమర్శించింది. ఒకే ఇంటి చిరునామాపై వందల కొద్దీ నకిలీ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించింది.






