8 July, 2026 | 7:51 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

ఎవరీ షంషూద్దీన్ జబ్బార్?

03-01-2025 01:55 AM
  1. జబ్బార్ చరిత్ర ఇదే..

  2. టెక్సాస్‌లోని బ్యూమాంట్‌లోనే షంషూద్దీన్ జబ్బార్ పుట్టి, పెరిగాడు. అక్కడే అతడి పాఠశాల విద్య పూర్తుంది. జార్జియా స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్స్‌లో అతడు గ్రాడ్యూయేషన్ పట్టా పొందాడు. సుమారు 10ఏళ్లపాటు అతడు అమెరికా మిలిటరీలో హ్యూమన్ రీసోరెస్స్, ఐటీ స్పెషలిస్ట్‌గా పని చేశాడు. మార్చి 2007 నుంచి జనవరి, 2015 వరకు అతడు రెగ్యులర్ సోల్జర్‌గా విధులు నిర్వర్తించాడు. అనంతరం 2020 జూలై వరకు ఆర్మీ రిజర్వ్‌లో పని చేశాడు. ఉద్యోగ రీత్యా అతడు అమెరికా ఆర్మీ తరఫున ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా కొద్దికాలం విధులు నిర్వర్తించాడు. అనంతరం అతడు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా కూడా పని చేశాడు. అయితే రియల్ ఎస్టేట్‌లో నష్టాలతో జబ్బార్ ఆర్థికంగా చితికిపోయినట్టు తెలుస్తోంది. జబ్బార్‌కు రెండుసార్లు వివాహం జరగ్గా.. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నాడు. 2014లో ఫోర్ట్ బ్రాగ్గ్ ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికినట్టు రికార్డులు ఉన్నాయి. ఆ కేసులో జబ్బార్ 210 డాలర్ల ఫైన్ చెల్లించాడు. 2002లో హారిస్ కౌంటీలో ఓ చిల్లర దొంగతనం కేసులో తొమ్మిది నెలలు కమ్యూనిటీ సూపర్‌విజన్ చేశాడు. 

  3. న్యూ ఓర్లీన్స్ ట్రక్కు బీభత్సంలో 15కు పెరిగిన మృతుల సంఖ్య

నిందితుడు టెక్సాస్ వాసిగా గుర్తింపు

ఉగ్రకోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు

ట్రంప్ హోటల్ దగ్గర పేలుడు

ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

న్యూయార్క్ నైట్ క్లబ్ వద్ద కూడా కాల్పులు

వాషింగ్టన్, జనవరి 2: న్యూ ఇయర్ వేళ అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. లూసియానా రాష్ట్రంలోని న్యూ ఓర్లీన్స్ పట్టణానికి చెందిన బార్బన్ వీధిలో ట్రక్కుతో దుండగుడు బీభత్సం సృష్టించిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 15కు చేరింది. ఈ ఘటనలో సుమారు 30మందిపైగా గాయపడ్డారు. న్యూఓర్లీన్స్‌లోని బార్బన్ స్ట్రీట్ కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది.

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వేలాది మంది వేడుకలకోసం తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3.15 సమయంలో ప్రజలంతా సంబరాలు జరుపుకొంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న సమయంలో ఓ దుండగుడు పికప్ ట్రక్కుతో జనంపైకి దూసుకెళ్లాడు. అనంతరం కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే పోలీసులు స్పందించి అతడిని మట్టుబెట్టారు.

ఈ ఘటనలో తొలుత 10 మంది ప్రాణాలు కోల్పోగా ఆ తర్వాత మరణాల సంఖ్య 15కు పెరిగింది. ఈ దాడికి తెగబడిన వ్యక్తిని టెక్సాస్‌కు చెందిన షంషూద్దీన్ జబ్బార్(42)గా అధికారులు గర్తించారు. జబ్బార్ వాహనంలో ఐఎస్‌ఐఎస్ జెండాతోపాటు పేలుడు పదార్థాలను గుర్తించినట్టు వెల్లడించారు. దాడి వెనక ఉగ్రకోణంపై ఉందా అనే విషయంపై అమెరికా దర్యాప్తు సంస్థ(ఎప్‌బీఐ) దర్యాప్తు జరుపుతోంది. 

జబ్బార్ గురించి అతడి సోదరుడు చెప్పిన మాటలు

షంషూద్దీన్ జబ్బార్ ఎంతో మంచివాడని తన సోదరుడు అబ్దుర్ జబ్బార్ మీడియాకు తెలిపారు. స్నేహస్వభావం, దయతో ఉండేవాడని చెప్పారు. చిన్నప్పుడే ఇస్లాం మతంలోకి మారినట్టు వెల్లడించారు. కానీ ప్రస్తుత దాడిని మతానికి ముడిపెట్టడం సరికాదన్నారు. రాడికలైజేషన్ ప్రభావంతోనే దాడికి తెగబడి ఉంటాడని పేర్కొన్నారు. 

కుటుంబాన్ని కడతేర్చాలనుకుని ఆ తర్వాత ప్లాన్ మార్చి..

బార్బన్ స్ట్రీట్‌లో బీభత్సం సృష్టించడానికి ముందు షంషూద్దీన్ జబ్బార్ తన కుటుంబాన్ని కడతేర్చాలనుకున్నాడు. ఈ విషయాన్ని దాడికి ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో స్వయంగా జబ్బార్ వెల్లడించాడు. తన విడాకుల గురించి వివరించి అనంతరం సెలబ్రేషన్ కోసం కుటుంబ సభ్యులను పిలిచి వారిని హత్య చేయాలనుకున్నట్టు వీడియోలో పేర్కొన్నాడు.

ఇదే సమయంలో జబ్బార్ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. అయితే ఆ తర్వాత అతడు తన ప్లాన్ మార్చుకుని బీభత్సం సృష్టించాడని అంతర్జాతీయ మీడియా సీఎన్‌ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే ఈ దాడి కేవలం జబ్బార్ మాత్రమే కారణమని తాము అనుకోవట్లేదని ఎఫ్‌బీఐ పేర్కొంది. మరికొందరి హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పింది. 

సమగ్ర దర్యాప్తునకు ఆదేశం

న్యూఓర్లీన్స్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ కేసును ఉగ్ర కో ణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నా రు. ప్రతి అంశాన్నీ పరిశీలించి, ఏం జరిగిందో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఈ దుర్ఘటనతో తన హృదయం బరువెక్కినట్టు విచారం వ్యక్తం చేశారు. హింసను ఎ ట్టిపరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. 

ట్రంప్ హోటల్ దగ్గర కూడా..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన లాస్ వేగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. హోటల్ ముందు పార్క్ చేసిన టెస్లా కారులో ఉదయం 8.40గంటల సమయంలో పేలుడు సంభవించగా కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయ ర్ వేడుకల సందర్భంగా న్యూఓర్లీన్స్ నగరంలో ట్రక్కు బీభత్సం సృష్టించిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటు చేసుకుంది.

దీనిపై అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) ప్రారంభించింది. ఉగ్రకోణం దిశలో దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. న్యూఓర్లీన్స్, లాస్ వేగాస్‌లో జరిగిన ఘటనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ రెండు ఘటనలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎఫ్‌బీఐ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. కారు బాంబు కోసం సైబర్ ట్రక్కును అద్దెకు తీసుకున్న వ్యక్తిని కొలరాడో స్ప్రింగ్స్‌కు చెందిన మాథ్యూ లివెన్స్‌బర్గ్‌గా ఎఫ్‌బీఐ అధికారులు అనుమానిస్తున్నారని అంత ర్జాతీయ మీడియా పేర్కొంది.

అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు అతడి పేరును ప్రకటించేందుకు అధికారులు నిరాకరించినట్టు తెలిపింది. కాగా 37ఏళ్ల మథ్యూ గతంలో అమెరికా ప్రత్యేక దళమైన గ్రీన్ బెరెట్స్‌లో పని చేసినట్టు సమాచారం. కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్ నిపుణుడిగా పని చేసిన అనుభవం అతడికి ఉన్నట్టు తెలుస్తోంది. న్యూఓర్లీన్స్, లాస్ వేగాస్ ఘటనలకు అమెరికా మాజీ సైనికులే ప్రధాన నిందితులుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. 

క్రైమ్ రేటు పెరిగిపోయింది

న్యూ ఇయర్ సందర్భంగా అమెరికాలో చోటు చేసుకున్న వరుస ఘటన లపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దేశంలో వలసల కారణంగా నేరస్థుల సంఖ్య అధికమైనట్టు ముందే హెచ్చరించినట్టు పేర్కొన్నారు.

అయితే తన మాటలను డెమోక్రాట్లు, మీడియా ఖండించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పింది నిజమేనని తాజా ఘటనలు చెబుతున్నాయన్నారు. అమెరికాలో క్రైం రేటు బాగా పెరిగిపోయిందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఉగ్రచర్యగా కనిపిస్తోందన్న మస్క్

న్యూఓర్లీన్స్, లాస్ వేగాస్‌లో జరిగిన రెండు ఘటనల మధ్య సంబంధం ఉందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. ‘ఇది ఉగ్రచర్యగా కనిపిస్తోంది. ఘటనలకు కారణమైన రెండు కార్లను టూర్ రెంటల్ వెబ్‌సైట్ నుంచే నిందితులు అద్దెకు తీసుకున్నారు’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

కారు బాంబులకు సైబర్ ట్రక్కును ఎన్నుకోవడాన్ని మస్క్ చెత్త నిర్ణయంగా అభివర్ణించారు. సైబర్ ట్రక్కు తయారీ ఉపయోగించిన స్టెయిన్‌లెస్ స్టీల్ పేలుడు తీవ్రతను అడ్డుకుందని పేర్కొన్నారు. సైబర్ ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నా వాటి తీవ్రతకు అక్కడ లాబీకి ఉన్న గాజు అద్దాలు కూడా పగల్లేదని మరో ట్వీట్‌లో మస్క్ పేర్కొన్నారు. 

న్యూయార్క్ నైట్ క్లబ్ వద్ద కాల్పులు

న్యూయార్క్‌లోని నైట్ క్లబ్ వద్ద బుధవారం రాత్రి కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది గాయపడ్డారు. న్యూయార్క్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గురువారం ఉదయం వెల్లడించారు. న్యూయార్క్‌లోని క్వీన్స్ కౌంటీకి చెందిన అమజురా నైట్‌క్లబ్‌లో బుధవారం రాత్రి ఒక ప్రైవేటు ఈవెంట్ జరుగుతుండగా 16 మధ్య వయసు ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడకు చేరుకుని క్లబ్ బయట ఉన్న వారిపై కాల్పులకు తెగబడినట్టు అధికారులు పేర్కొన్నారు.

అనంతరం ఆ దుండగులు అక్కడ నుంచి పారిపోయినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా నలుగురు పురుషులు తీవ్రంగా గాయపడ్డట్టు పేర్కొన్నారు. సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు వెల్లడించారు. అయితే దీన్ని ఉగ్రదాడిగా భావించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు.