టెట్ వాయిదా వేయండి!
l ఎన్నికల సంఘానికి టెట్ అభ్యర్థుల లేఖలు
l పోలింగ్ రోజు పరీక్ష నిర్వహిస్తే ఓటు హక్కును కోల్పోనున్న 70 వేల మంది గ్రాడ్యుయేట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): టెట్ వాయిదా వేయాలని అభ్యర్థులు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇటీవల వచ్చిన నేపథ్యంలో టెట్‌ను వాయిదా వేయాలని వారు కోరారు. మే 27న ఉప ఎన్నికకు పోలింగ్ ఉన్నది. అదే రోజు టెట్ కూడా ఉండటంతో పరీక్షలు వాయిదా వేయించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. వరంగల్ నల్లగొండొ ఖమ్మం జిల్లాల నుంచి సుమారు 70 వేల మంది అభ్యర్థులు టెట్ రాయనున్నారు. ఇప్పటికే టెట్‌కు వారు దరఖాస్తులు చేసుకున్నారని, పోలింగ్ రోజు పరీక్ష పెడితే దాదాపు 70 వేల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఎన్నికల సంఘానికి వెల్లడించారు.
మార్చి 16న టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మే 20 నుంచి జూన్ 3 వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ నిర్వహిస్తామని ఇప్పటికే తెలిపింది. దీంతో వరంగల్ నల్లగొండ ఖమ్మం జిల్లాల నుంచి వేల మంది అభ్యర్థులు టెట్, డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు. వీరంతా ఓటు వేసేందుకు స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణ సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని టెట్‌ను వాయిదా వేయించాలని అభ్యర్థులు లేఖలో కోరారు.






