మిగిలింది 14 రోజులే
l ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న అభ్యర్థులు
l సమయం తక్కువగా ఉండటంతో రోడ్ షోలకే మొగ్గు
l ఎండల తీవ్రతతో ప్రచారానికి ఇబ్బందులు
l ఉదయం, సాయంకాలాల్లో కాన్వాసింగ్‌పై దృష్టి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గర పడుతోంది. వచ్చే నెల 13న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల పరిధిలో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్యే పోటీ సాగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొనగా... హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు బలంగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు వెనకబడి పోయిందనే విధంగా ప్రచారం నడిచింది. అదే సమయంలో అబ్‌కీ బార్ 400 పార్ (ఈ సారి 400కు పైగా) అంటూ బీజేపీ నాయకులు ప్రచారం ప్రారంభించారు.
మోదీ అధికారంలోకి వస్తే దేశాన్ని మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తారంటూ పార్టీ నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీపై ఆరోపణలతో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్ పార్టీ టికెట్‌ను అభ్యర్థులు వద్దనుకునే స్థాయికి పడిపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బస్సుయాత్రతో తిరిగి పార్టీని పోటీలోకి తెచ్చినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ తన పదునైన వాగ్ధాటితో ప్రజలను తనవైపునకు తిప్పుకునే ందుకు ఈ బస్సుయాత్రను వినియోగించు కుంటారని భావిస్తున్నారు.
మండే ఎండల్లో...
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేటి నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలియచేసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ప్రచారంలో పాల్గొ నే పరిస్థితి కనబడటం లేదు. దీంతో సమ యం లేకపోవడం వల్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారా నికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఉద యం, సాయంకాలాల్లో ప్రచారాలు నిర్వహించినా ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. సాయంత్రం పూట, రాత్రి 9 గంటల వరకు జరిగే ప్రచారానికే ఆదరణ లభిస్తుండటంతో ఆ సమయంలో ముఖ్యమైన ప్రాంతాలు, రద్దీ ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రచారంలో కొందరు అభ్యర్థులు తమ పార్టీ కార్యకర్తలు, స్థానికులకు మజ్జిగ ప్యాకెట్లు, చల్లని వాటర్ బాటిళ్లను అందిస్తున్నారు. ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉండటం కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు రాకపోవడం ఉత్తమమని అభ్యర్థులు భావిస్తున్నారు. మొత్తానికి పోలింగ్ తేదీకి కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో ఎలాగైనా ప్రచారంలో ముందుండాలని వివిధ పార్టీల అభ్యర్థులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండు వారాలు మాత్రమే..
లోక్‌సభ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. మే 11 సాయంత్రం వరకు ప్రచారం నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం అభ్యర్థులు ప్రచారం చేసేందుకు కేవలం 14 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్లు, జాతీయ స్థాయి నేతలు, పార్టీల అధ్యక్షులు, అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. అయితే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సుమారు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా యి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు రాబోయే 14 రోజుల్లో తమ నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం చేయడం కూడా కష్టమే. షెడ్యూల్ ప్రకారం వివిధ పట్టణాలు, గ్రామాలను కవర్ చేస్తున్నారు. ఏరోజు కారోజు క్షేత్రస్థాయి నేతలకు సమాచారమిచ్చి.. గ్రామాల్లో కలియ తిరుగుతున్నారు. వీధి చివర్లలో కార్నర్ మీటింగ్‌లు పెడుతున్నారు. తమ బలాలు, ప్రత్యర్థి బలహీనతలను ఏకరువు పెడుతున్నారు.






