18 April, 2026 | 3:05 AM

వాయిదా పడ్డ వార్డుల విభజన సమావేశం

09-06-2025 07:09 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మున్సిపాలిటీ వార్డు విభజనపై సోమవారం నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం వాయిదా పడింది. టౌన్ ప్లానింగ్ అధికారి సాయి రామ్ ఆధ్వర్యంలో రాజకీయ పక్షాలతో వార్డుల విభజనపై సమావేశం నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు వార్డుల విభజన సరిగాలేదని అధికారుల దృష్టికి తేవడానికి ప్రజలు తరలివచ్చారు. అయితే టౌన్ ప్లానింగ్ అధికారి కాకుండా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించాలని పట్టుపట్టారు.

వార్డుల విభజన సరిగాలేదని, పూర్వ కేసముద్రం గ్రామం నుండి వార్డుల కేటాయింపుకు ప్రాధాన్యం ఇవ్వకుండా చివరకు ఇవ్వడం సరికాదంటూ పేర్కొన్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తే తప్ప సమీక్షకు హాజరు కామని ప్రజలు, పార్టీల నాయకులు తేల్చి చెప్పారు. దీనితో ఈ విషయాన్ని టిపిఓ సాయిరాం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి కి ఫోన్లో సమాచారం ఇవ్వగా, ఒకటి రెండు రోజుల్లో తన సమక్షంలో సమావేశం నిర్వహించడానికి తేదీ ఖరారు చేస్తానని చెప్పారు. దీనితో సోమవారం నిర్వహించాల్సిన వార్డుల విభజన సమావేశం వాయిదా వేస్తున్నట్లు టీపీవో తెలిపారు.