30-08-2025 02:19:17 PM
అధ్వానంగా మారిన ప్రధాన రహదారి
ప్రమాదపుటంచులో ప్రయాణం
అడుగు అడుగుకో గుంత-కళ్లు మూస్తే కాటికే
మంగపేట, (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలో(Mangapet mandal) యమలోకానికి దారి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మంగపేట మండల కేంద్రంలోని గిరిజన పెట్రోల్ పంపు,రైతు వేదిక,కోమటిపల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని రోడ్లు వరద తాకడికి కోతకు గురై పెద్ద గుంటలు ఏర్పడి ప్రయాణికులకు యమలోకానికి దారి మారింది ఈ రోడ్డు కోతకు గురి కావడంతో, అటువైపు వెళ్లే ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. ఏమాత్రం ఆదమరచిన అదుపుతప్పి డ్రైవింగ్ చేసినట్లయితే ఆ రోడ్డుకి అవతల పడి ప్రాణాలు పోవడం ఖాయం అనే సంకేతాలు కళ్ళముందే కనబడుతున్నాయి.ఇది ఇలా ఉండగా ఏటూరునాగారం బూర్గంపాడు (163) జాతీయ రహదారిపై ప్రయాణం దినదిన గండంగా మారింది.గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం నరకప్రాయంగా ఉంది.
వందలాది వాహనాలు ప్రయాణించే ఈ రహదారిపై అధికారులకు గుంతలు కనిపించట్లేదా అని స్థానిక ప్రజలు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కిలోమీటర్ వరకు రోడ్డంతా పాడైంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనం నడపలేని పరిస్థితి తయారైంది. వాహనదారులు ఒక గుంతను తప్పించబోయి మరోగుంతలో పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. అడుగులోతు గుంతలు ఏర్పడినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఇది ఏటూరునాగారం బూర్గంపాడు (163) జాతీయ ప్రధాన రహదారి అయినప్పటికి రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో జనం పాలకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. చీకట్లో వాహనం నడపడం చాలా కష్టంగా మారింది. ఎదురుగా వచ్చే వాహనం లైట్ల వెలుతురుకు గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోడ్డుకోసం జనాలు రోడ్డుపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డును మరమ్మత్తులు చేపించాల్సిన అవసరం ఉంది.