30-08-2025 09:17:08 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఒత్తిడితో కూడిన జీవితంతో గుండె పోటుకు గురైన వ్యక్తుల ప్రాణాలను సిపిఆర్ ద్వారా నిలబెట్టవచ్చని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. ఎస్. సంధ్య అన్నారు. శనివారం రోజున హనుమకొండలోని కాకతీయ మెడికల్ కాలేజీ "సేవార్థ్ క్లబ్" ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఐ ఆడిటోరియంలో ప్రాజెక్ట్ హార్ట్ ఇండియా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ డా.సంధ్య మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అనేక రుగ్మతలకు గురికావాల్సి వస్తుందన్నారు. కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) అనేది ఒక అత్యవసర చికిత్స, ఇది ఎవరైనా శ్వాస తీసుకోవడం లేదా హృదయ స్పందన ఆగిపోయినప్పుడు చేయబడుతుందన్నారు.
అమెరికా నుండి ఆన్లైన్లో
ప్రాజెక్ట్ హార్ట్ ఇండియా వ్యవస్థాపకులు నేషనల్ ఇండియా హబ్ కమ్యూనిటీ హెల్త్ అండ్ సీపీ ఆర్ ట్రైనింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు డా. వేమూరి ఎస్ మూర్తి మాట్లాడుతూ... గుండెపోటుకు గురైనస్థితిలో ఉన్నప్పుడు. సీపీఆర్ ఒక ప్రాణాన్ని కాపాడటానికి సహాయపడుతుందని వివరించారు. ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తి జీవిత అవకాశాలను పెంచడానికి దోహదపడుతుందన్నారు. ఈ నైపుణ్యం సాధారణ ప్రజలకు క్లిష్టమైన క్షణాల్లో ప్రాణాలను రక్షించే సహాయాన్ని అందించడానికి, అత్యవసర పరిస్థితుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపకరిస్తుందన్నారు.
ప్రాజెక్టు హార్ట్ ఇండియా తెలంగాణ బాధ్యులు డా. శ్రీనివాస్ రామక మాట్లాడుతూ గుండెపోటుకు గురైన వ్యక్తి యొక్క ప్రాణాన్ని సిపిఆర్ ద్వారా నిలబెట్టే ప్రయత్నాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రాజెక్ట్ హార్ట్ ద్వారా చేపట్టిన కార్యక్రమ నిర్వాహకులు సేవార్థీ క్లబ్ బాధ్యులను అతిథులు అభినందించారు. హడుప్సా ఆధ్వర్యంలో నగరంలోని 11 పాఠశాల విద్యార్థులకు సి పి ఆర్ పై అవగాహన కల్పించారు.