చినుకు పడితే కరెంట్ కట్!
- వాన కురిస్తే మండలంలో గంటల తరబడి విద్యుత్ కోత
- అప్రకటిత కోతలతో స్తంభిస్తున్న ప్రభుత్వ సేవలు
- రాత్రి వేళ నిద్రలేక అవస్థలు.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
- సిబ్బంది కొరతే కారణమంటూ విమర్శలు
- విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలంటూ వేడుకోలు
మోతె, సెప్టెంబర్ 3 : వర్షపు(Rainy) చినుకు పడితే చాలు విద్యుత్ సరఫరా(Power supply) నిలిచిపోవడం మండలంలో నిత్యకృత్యంగా మారింది. ఇటీవల కాలంలో రోజువారీగా విధిస్తున్న విద్యుత్ కోతలకు అడ్డు అదుపులేకుండా పోతోందని, మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు లోడే అంతరాయానికి కారణం
టోల్ గేట్కు ప్రత్యేక కనెక్షన్ ఇవ్వకుండా, కొన్ని ప్రైవేట్ కంపెనీలు(Private companies), క్రషర్ క్వారీ(Crusher Quarry)లకు ఇష్టానుసారంగా విద్యుత్ అనుమతులు(Electricity Approvals) ఇవ్వడం వల్లే వ్యవస్థపై అధిక లోడు(Overload) పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పరిమితికి మించిన లోడ్ కారణంగానే సరఫరాలో నిత్యం అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు తెలుపుతున్నారు.
ప్రభుత్వ సేవలకు విఘాతం
అను నిత్యం పని వేళల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే కరెంట్ కోతలు విధిస్తుండటంతో మండల కేంద్రంలో కార్యకలాపాలు సరిగ్గా జరగడం లేదు. తహసీల్దార్ కార్యాలయంలో రోజువారీ భూముల రిజిస్ట్రేషన్లు, ఎంపీడీఓ కార్యాలయంలో ఆన్లైన్ సేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మీ సేవా కేంద్రం, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్లలో పనులన్నీ విద్యుత్ అంతరాయంతో నిలిచిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో తప్పని అవస్థలు
గత రెండు మూడు నెలలుగా ప్రతిరోజూ ఉదయం పూట రెండు మూడు గంటలు, రాత్రి వేళల్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు విద్యుత్ నిలిపివేస్తుండటంతో తీవ్ర ఉక్కపోత, దోమల బెడదతో రోగాల బారిన పడాల్సి వస్తోందని ప్రజలు మనోవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి సరఫరాలో స్పష్టమైన మార్పులు చేయకపోతే సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేపడతామని, ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని ప్రజా ప్రతినిధులు, స్థానికులు స్పష్టం చేశారు.
నెలలు గడుస్తున్నా అవస్థలు తప్పడం లేదు
చిన్న చిన్న కారణాలు సాకుగా చూ పి గంటల తరబడి కరెంట్ తీసివేస్తున్నా రు. నిత్యం విద్యుత్ అంతరాయంతో నిద్ర లేక మూడు నెలలుగా అవస్థలు పడుతున్నాము. హాస్పిటల్స్, ప్రభుత్వ ఆఫీసుల్లో సేవలు నిలిచిపోతున్నాయి. అధికారులు స్పందించి మండల కేంద్రం లో నాణ్యమైన విద్యుత్ అందించాలి.‘
కొమ్ము లింగరాజు, స్థానికుడు
సిబ్బంది కొరతే ప్రధాన సమస్య..
మండలంలో తీవ్రమైన సిబ్బంది కొరత ఉంది. సుమారు ఏడు గ్రామాలకు లైన్మెన్లు లేకపోవడంతో వేరే ప్రాంత సిబ్బందికి అదనపు బాధ్యతలు పడటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాధ్యమైనంతవరకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా మా వంతు కృషి చేస్తున్నాం. సబ్ స్టేషన్కు వచ్చిన రైతులకు, ప్రజలకు త్వరలోనే ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నాం. త్వరలో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తాం.
శాంతి, ఏఈ, మోతె






