20-01-2026 01:14:58 AM
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి) : రాష్ట్రంలో జంగిల్ రాజ్ పరిస్థితి నెలకొంది.. పరిపాలన వింతవింతగా సాగుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ జోక్యం మితిమీరడంతో.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇందుకు సోమవారం నాడు జరిగిన సంఘటనే ఒక ఉదాహరణ. ఉన్నఫళంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తం గా ఉన్న 1,800 స్టోన్ క్రషర్స్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండానే.. వాస్తవ పరిస్థితుల ను పరిశీలించకుండా..
కాలుష్యం ప్రభావాన్ని అంచనా వేయకుండానే పైవారి నుంచి వచ్చిన ఆదేశాలమేరకు స్టోన్ క్రషర్స్‌కు విద్యుత్తును నిలిపివేయడం.. ఈ జంగిల్ రాజ్ పరిపాలనకు ఇది చిహ్నమని స్టోన్ క్రషర్స్ యాజమాన్యాలు గగ్గో లు పెడుతున్నాయి. పలు చోట్ల విద్యుత్తు శాఖ కార్యాలయాల ముందు తమ ఆందోళనను వ్యక్తంచేసి, అధికారులకు విజ్ఞాపన పత్రాలు అందించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,800 స్టోన్ క్రషర్స్ నడుస్తున్నట్టు అంచ నా. ఇందులో సుమారు 90 శాతం క్రషర్స్‌కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) నుంచి క్లియరెన్స్ (అనుమతులు) లేనట్టు సమాచారం. అయితే వీటికి పీసీబీ నుంచి క్లియరెన్స్ లేనప్పటికీ.. అనేక సంవత్సరాలుగా ఈ స్టోన్ క్రషర్స్ నడిపిస్తున్నారు. అంటే అక్రమంగానే ఇవన్నీ నడిపిస్తున్నారన్నమాట.
ఇప్పటి వరకు అటు పీసీబీ నుంచిగానీ.. ఇటు సంబంధిత శాఖల నుంచిగానీ ఎలాంటి తనిఖీలు, షోకాజ్ నోటీసులు ఇవ్వడం లాంటివి లేవు. కానీ అకస్మాత్తుగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టోన్ క్రషర్స్‌కు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం విద్యుత్తును నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి క్లియరెన్స్ (అనుమతులు) లేకపోవడంతో.. అక్కడి నుంచి వచ్చిన నివేదిక ప్రకారం స్టోన్ క్రషర్స్‌కు విద్యుత్తును నిలిపివేసినట్టుగా తెలుస్తున్నది.
అన్నీ అనుమతులున్నా.. గుంపులో గోవిందం..
సుమారు 1,800 స్టోన్ క్రషర్స్‌లో.. 90 శాతం క్రషర్స్‌కు అనుమతులు లేకున్నా ఇప్పటివరకు సంవత్సరాలుగా నడిపిస్తున్నా.. చూసీచూడనట్టుగా వదిలేసిన పీసీబీ, ఇతర శాఖల అధికారులు.. అన్నిరకాల అనుమతులు ఉన్న 10 శాతం క్రషర్స్‌కు కూడా విద్యుత్తును నిలిపివేయడంతో ఆయా క్రష ర్స్ యాజమాన్యాలు లబోదిబోమంటున్నా యి. అనుమతులు లేని క్రషర్స్‌కు కనీసం ముందస్తుగా నోటీసులు ఇచ్చి విద్యుత్తును నిలిపివేయాల్సిందని..
అలాకాకుండా.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్తు నిలిపివేయడం.. అందులో నూ అనుమతులున్న క్రషర్స్‌కు సైతం విద్యు త్తు సరఫరాను నిలిపివేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదంతా చూస్తే.. గుంపులో గోవిందం అన్న చందంగా అటు పీసీబీ అధికారులు, మరోవంక విద్యుత్తు శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి.
అకస్మాత్తుగా ఎందుకు..?
అన్ని సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న స్టోన్ క్రషర్స్ విషయంలో ఇప్పటివరకు అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), ఇటు విద్యుత్తు శాఖ అధికారులు గుడ్డిగా వ్యవహరిస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. 90 శాతం క్రషర్స్ అనుమతులు లేకుండా నడస్తుంటే.. ఒక్కనాడుకూడా అటువేపు చూడకుండా.. ‘మామూలు’గా తీసుకున్నారనే విమర్శలున్నాయి.
అయితే అకస్మాత్తుగా సోమవారమే ఎందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారనేదానిపై చర్చ సాగుతోంది. పైగా అనుమతులు ఉన్న క్రషర్స్‌కు కూడా విద్యుత్తు నిలిపివేయడంలో మతలబు ఏమిటనే చర్చ సాగుతోంది. ఇలాచేయడం ద్వారా గంపగుత్తగా క్రషర్స్ నుంచి ‘మామూళ్లు’ వసూలు చేయాలనే ప్రణాళిక ఏమైనా ఉందా అనే అనుమానాలుకూడా బలంగా వినపడుతున్నాయి.
సన్నిహిత సంబంధాలు..!
నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రషర్స్ బ్యాక్‌గ్రౌండ్ పరిశీలిస్తే.. స్థానిక రాజకీయనాయకులతో, అలాగే ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ వాస్తవం. స్థానిక ఎన్నికల సమయంలోనూ, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. వీరి నుంచి ఎన్నికల ఫండ్ వస్తుందనే విషయంకూడా అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పటివరకు అటువేపు పీసీబీ అధికారులుగానీ, విద్యుత్తు శాఖ అధికారులుగానీ కన్నెత్తి చూడలేదనే చెప్పవచ్చు.
అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో.. ఇప్పుడు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల దృష్టి.. ఈ సమస్యను పరిష్కరించే దిశగా మళ్ళుతుంది. ఇప్పటికే సింగరేణి టెండర్ వ్యవహారం, మహిళా ఐఏఎస్ అధికారి, ఒక మంత్రిపై మీడియాలో వచ్చిన కథనాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా స్టోన్ క్రషర్స్‌కు విద్యుత్తు నిలిపివేత సంఘటన వెనుక..
దృష్టి మళ్లించే వ్యవహారం ఏమన్నా ఉందనే అనుమానాలుకూడా వెలువడుతున్నాయి. రాజకీయంగా తమ బలాన్ని చాటుకునే ప్రయత్నంలో భాగంగా.. స్టోన్ క్రషర్స్‌తో రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని.. ఎవరైనా నేతలు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేలా వ్యవహరించారా అనికూడా చర్చిస్తున్నారు. మొత్తానికి ఈ స్టోన్ క్రషర్స్ వ్యవహారం వెనుక కూడా రాజకీయ కోణం స్పష్టంగా ఉందనే అనుమానాలు ఉన్నాయి.
కాలుష్యమయంగా హైదరాబాద్..
ఒకవంక ఇప్పటికే హైదరాబాద్ మహా నగరంలో కాలుష్యం తీవ్రంగా రోజురోజుకూ పెరిగిపోతోంది. గాలి, నీటి, శబ్ద కాలుష్యంతో నగర పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ నగరంతో కాలుష్యంలో హైదరాబాద్ పోటీపడుతోందని తాజా అధ్యయనాల్లోనూ వెల్లడయ్యింది. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్ లోపల అసలు స్టోన్ క్రషర్స్ ఎలా నడిపిస్తారనే ప్రశ్న ఉదయించకమానదు. కానీ బడా రియల్ కంపెనీల ముసుగులో..
సొంత అవసరాల కోసమే అనే నెపంతో స్టోన్ క్రషర్స్ నిర్వహిస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే.. ఇక్కడ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనుకోవాల్సి వస్తోంది. అదే ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా స్టోన్ క్రషర్స్‌కు విద్యుత్తు నిలిపివేయడం.. అందుకు పీసీబీ క్లియరెన్స్ లేదని, పర్యావరణం కాలుష్యం అవుతుందనే అధికారుల ఉద్ఘాటన వెనుక అసలు మతలబు ఏమిటనే ప్రశ్న వేధిస్తోంది.
క్రషర్స్‌తో కాలుష్యం అనేది.. ఓఆర్‌ఆర్ లోపల అయినా.. ఓఆర్‌ఆర్ బయట అయినా.. ఒకే విధంగా ఉంటుంది. పైగా ఓఆర్‌ఆర్ లోపల అసలు క్రషర్స్ నడపడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఈ నేపథ్యంలో అధికారులు.. రెండు విధాలుగా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందులో రాజకీయ కోణంపై.. ఎవరికి అంతిమంగా లాభం కలుగుతుందనే విషయంపై చర్చకూడా జరుగుతోంది.
తక్షణం సర్కారు స్పందించాలి..
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు రాష్ట్రవ్యాప్తంగా స్టోన్ క్రషర్స్‌కు విద్యుత్తు నిలిపివేయడంపై విచా రణ చేయాలి. వెంటనే అనుమతులున్న క్రషర్స్‌కు విద్యుత్తును పునరుద్ధ రించడంతోపాటు.. అప్పటివరకు జరిగిన నష్టాన్ని పూరించేలా చర్యలు తీసు కోవాలి. అలాగే అనుమతులు లేకుం డా నడుస్తున్న 90 శాతం క్రషర్స్‌ను అధికారులు తనిఖీలు చేసి, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అదే సమయంలో.. ఓఆర్‌ఆర్ లోపల నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్స్‌ను మూసివేయాల్సిన అత్యవసరం ఉంది. దీనివల్ల హైదరాబాద్ నగరంలో కాలు ష్య బాధ ఒకింత ఉపశమనం కలుగుతుంది. పైగా ఈ స్టోన్ క్రషర్స్‌ను శాశ్వ తంగా మూసివేయడానికి, బడా రియల్టర్లపై చర్యలు తీసుకోవాలని క్రషర్స్ యాజమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఓఆర్‌ఆర్ లోపల..యథేచ్చగా..
నిజానికి నిబంధనల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల స్టోన్ క్రషర్స్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవు. అయితే ఔటర్ చుట్టూరా మాత్రం అనేక స్టోన్ క్రషర్స్ కనపడుతూనే ఉన్నాయి. బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీల ఆధ్వర్యంలో ఈ క్రషర్స్ నడుస్తున్నాయి. తమ సొంత అవసరాల కోసం స్టోన్ క్రషర్స్‌ను వాడుకుంటున్నామని.. తాము ఎలాంటి వ్యాపారం చేయడం లేదని ఆ బడా రియల్టర్లు దబాయిస్తున్నారు.