20-01-2026 01:15:01 AM
ఆదిలాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): మైనర్లకు డ్రైవింగ్ కోసం వాహనాలు ఇచ్చిన వాహన యజమానులు, తల్లిదండ్రులు సైతం కేసులలో భాగస్వామ్యం అవుతారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా 18 ఏండ్ల లోపు పిల్లలు (మైనర్లు) లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికాకుండా జిల్లాలో మైనర్ డ్రైవింగ్ చేసిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని తల్లిదండ్రులకు, యువతకు, మైనర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... మైనర్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, ఇక నుంచి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 261 మైనర్లు వాహనాలతో పట్టుబడ్డారని, 261 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎ.ఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సీఐ లు సునీల్ కుమార్, నాగరాజు, ప్రణయ్ కుమార్, ఫణిదర్, ట్రాఫిక్ ఎస్‌ఐలు దేవేందర్, మహేందర్ పాల్గొన్నారు.