5 May, 2026 | 4:13 AM

ఇక దక్షిణాది వంతు

05-05-2026 02:43 AM
  1. బెంగాల్ ప్రజలకు బీజేపీ గెలుపుతో మంచి రోజులు 
  2. దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం 
  3. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీని ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో ప్రజలు తమ ఆశీర్వాదం అందజేశారని, పశ్చిమ బెంగాల్‌లో భారీ మెజా రిటీ దక్కిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో తుడిచిపె ట్టుకుపోవడం ఖాయమని ఈ ఎన్నికల్లో రుజువైందని అన్నారు. దేశ ప్రజలంతా డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని కోరుకుంటున్నారని, దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని ధీమా వ్యక్తంచేశారు.

తెలంగాణలో కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం సానుకూలంగా ఉండనుందన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో అందరం కలిసి కట్టుగాపని చేసి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని కిషన్‌రెడ్డి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారిగా ఈనెల 10న తెలంగాణకు రానున్నారని, ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నామన్నారు.

కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదన్నారు. ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలకు, విజయం సాధించిన ఎమ్మెల్యేలకు కిషన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 15 ఏళ్లుగా బెంగాల్‌ను టీఎంసీ అస్తవ్యస్థం చేసిందని, అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని జంగల్ రాజ్‌గా మార్చిందని ఆయన విమర్శించారు.

అక్కడ పారిశ్రామిక వ్యవస్థను సీపీఎం, టీఎంసీ పార్టీలు ధ్వంసం చేశాయని పేర్కొన్నారు. ఈ ఫలితాలతో బెంగాల్ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని తెలిపారు. సోమవారం ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలోని అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి సంబరాలు చేసుకున్నారు. ఆతర్వాత బీజేపీ ఎంపీ డీకే అరుణ, నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మీడియాతో మాట్లాడారు.

పశ్చిమ బెంగాల్ ప్రజల ఆశీస్సులతో ఆ రాష్ట్రంలో తొలిసారిగా ఎన్డీఏ నేతృ త్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. దేశ ప్రజలంతా కూడా పశ్చిమ బెంగాల్‌లో మార్పు కావాలని కోరుకున్నారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చట్ట వ్యతిరేకంగా లక్షలాదిగా వలస వచ్చినవారు.. బెంగాల్ ప్రజలపై దాడులు చేశారన్నారు. తృణమూల్ అండతో బెంగాలీలపై వారు చేయని దౌర్జన్యం లేదని పేర్కొన్నారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం రావడం చాలా గొప్ప మార్పునకు నాంది అని అన్నారు.

బెం గాల్‌లో కోల్ మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో.. టీఎంసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని, వేలాది కోట్ల రూపాయల అక్రమా లకు పాల్పడ్డారని తెలిపారు. బెంగాల్‌లోని బొగ్గు గనుల్లో టీఎంసీ అరాచకత్వం సృష్టించిందని.. మమతా బెనర్జీ, అక్కడి మంత్రులు అక్రమంగా బొగ్గు ఉత్పత్తి చేసి, కోట్లు దండుకున్నారన్నారు. ఈ అక్రమ దందాను నిలిపేయాలని ఎన్నిసార్లు కోరినా మమతా బెనర్జీ స్పందించలేదన్నారు.

అక్కడ రాణిగంజ్ సహా వివిధ కోల్ బెల్ట్ నియోజకవర్గాల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచిందన్నారు. గతంలో సీపీఎం, ఇప్పుడు మమతా బెనర్జీ బెంగాల్లో పారిశ్రామిక వ్యవస్థను ధ్వంసం చేశారని, పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయేలా దుర్మా ర్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీంతో అక్కడి యువత ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు వలసపోయారన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభు త్వ పథకాలను కూడా అమలు చేయకుండా కుట్ర చేశారని, తృణమూల్ కాంగ్రెస్ గత ఏళ్లుగా.. బంగ్లాదేశ్  నుంచి వచ్చిన గూండాలను పెంచి పోషించిందన్నారు.

వారికి ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాల ఫలాలను అందించిందన్నారు. బంగ్లాదేశ్ గుండాలు.. మమతా దీదీ ఇచ్చిన ఉచిత పథకాలు అందుకుని.. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు చేశారని, హిందువులపై దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బెంగాల్‌లో డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.