17 August, 2026 | 1:06 AM

నిన్న ప్రశంస.. నేడు కన్నుమూత

17-08-2026 12:00 AM

అలంపూర్, ఆగస్టు 16: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఐదేళ్లుగా 108లో పనిచేసిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఎండి జాంగిర్ పాషా మృతి చెందారు. తన సేవలకు గుర్తింపుగా శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఆయన.. ఆదివారం తెల్లవారుజాము న గుండెపోటుతో కన్నుమూశారు. గద్వాల జిల్లాలో ఐదేళ్లుగా అత్యవసర సేవల్లో పనిచేసిన జాంగిర్ పాషా సేవలను గుర్తించిన అధికారులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రంతో సత్కరించారు.

ఆ ఆనందం 24 గంటలు గడవకముందే ఆయన మృతి చెందడం అందరినీ కలచివేసింది. ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో గుండెపోటుతో ఆయ న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో భార్య, ఇద్దరు కు మార్తెలు ఆధారాన్ని కోల్పోయారు. దీంతో గద్వాల జిల్లాలోని చెనుగోనిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.