17 August, 2026 | 2:08 AM

డిగ్రీకాలేజీ ప్రిన్సిపాల్ ప్రమోషన్లపై స్పష్టత ఇవ్వాలి

17-08-2026 01:03 AM
  1. అర్హులను అనగదొక్కకండి 
  2. అనర్హులను అందలం ఎక్కించకండి
  3.  క్యూజీడీఎల్‌ఏ అధ్యక్షులు డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్ 

ముషీరాబాద్,ఆగస్టు16(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపల్ ప్రమోషన్లు, అర్హుల జాబితా, సీనియారిటీ అంశా లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ (క్యూజిడిఎల్ ఏ) అధ్యక్షులు డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. బాలయ్య లు డిమాండ్ చేశారు. అర్హులైన అధ్యాపకులకు అన్యాయం జరగకుండా, అనర్హులకు అక్రమంగా ప్రమోషన్లు కల్పించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ మేరకు ఆదివారం వారు బషీర్ బాగ్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రిన్సిపల్ ప్రమోషన్లు ఎప్పుడు కల్పిస్తారో ప్రభుత్వం ప్రకటించాలని, 2026 ఆగస్టు 31లోపు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డిపిసి) సమావేశం నిర్వహిస్తారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని వారు కోరారు.అలాగే జూనియర్ లెక్చరర్ల సీనియారిటీ జాబితాను పూర్తిగా సరిచేసి, 1998, 2001, 2002, 2004 రిక్రూట్మెంట్ బ్యాచ్లకు సంబంధించిన సీనియారిటీని నిబంధనల ప్రకారం నిర్ణయించారా అనే విషయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఫేక్ పీహెచ్డీ సర్టిఫికెట్లకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అర్హుల జాబితా నుంచి తొలగించారా లేదా అనే దానిపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. జెడ్పీ పాఠశాలల నుంచి ప్రమోషన్ పొందిన వారిని డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపల్ లేదా ప్రొఫెసర్ హోదాలకు పరిగణిస్తున్నారా, వారి సీనియారిటీని ఏ విధంగా నిర్ణయించారో వివరించాలన్నారు. సిఎస్ సి పిఎస్ సి ద్వారా ఎంపికైన జెల్, డీల్ అభ్యర్థులను సీనియారిటీ జాబితాలో నిబంధనల ప్రకారం సరైన స్థానంలో చేర్చారా అనే అంశాన్ని కూడా వెల్లడించాలని కోరారు.

ప్రస్తుతం ఎన్ని ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో, ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తారా లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను ఎప్పుడు ప్రదర్శిస్తారో కూడా ముందుగానే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.అర్హులైన అధ్యాపకులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా ప్రమోషన్ ప్రక్రియ నిర్వహించాలని, సీనియారిటీ జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.