17 August, 2026 | 12:02 AM

కంకణబద్ధులమై పనిచేస్తున్నాం..

17-08-2026 12:00 AM
  1. రూ. 43.40 కోట్లతో అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు
  2. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

చిన్నచింతకుంట, ఆగస్టు 16 : నిరుద్యోగ యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించి, కార్పొరేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కంకణ బద్ధులమై పనిచేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. చిన్నచింతకుంట మండలంలోని పల్లమర్రి గ్రామ శివారులో రూ. 43.40 కోట్లతో నూతనంగా నిర్మించనున్న అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి ఆదివారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యం తో పాత ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని, యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక శిక్షణ, ఉద్యోగ భద్రత లభిస్తాయన్నారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

 గత పాలకులు నిర్లక్ష్యం చేసిండ్రు : ఎమ్మెల్యే జీఎంఆర్

గత పాలకులు నిర్లక్ష్యం చేసిన విద్యా, వైద్యం, మౌలిక రంగాలను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే జి మధు సుదన్ రెడ్డి అన్నారు. చిన్నచింతకుంటలో ఏటీసీ, జూనియర్ కళాశాల, దేవరకద్రలో డిగ్రీ కళాశాల, దమగ్నాపూర్లో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, కురుమూర్తి క్షేత్ర అభివృద్ధికి రూ. 110 కోట్లు, ముచ్చింతల-చిన్నచింతకుంట వంతెనకు రూ. 40 కోట్లు, బ్రహ్మోస్, మిథాని పరిశ్రమల రెండో యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బీడీ కార్మికులకు ఈఎస్‌ఐ డిస్పెన్సరీ, స్కిల్ సెంటర్లను మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్త, ఉన్నతాధికారులు హరిచందన దాసరి,  తదితరులు ఉన్నారు.