సంక్షేమ పథకాలలో రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అగ్రభాగంలో నిలిపారు
- 80 శాతం ఉచిత విద్యుత్ అందించిన ఘనత తమదే
- 33 జిల్లాలలోనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి అగ్రగామి
- జూన్ 2 నుండి సహజ మరణాలకు ఐదు లక్షల బీమా సౌకర్యం
- రైతులు పంట మార్పిడి వైపు మొగ్గుచూపాలి
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్, జూన్ 04 (విజయక్రాంతి) : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రభాగాన నిలిపారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గురువారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 2, 3, 4, 5 వ వార్డు ల ప్రజలతో పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న గత పాలకులు నియోజకవర్గం అభివృద్ధి లో పూర్తిగా వైఫల్యం చెందారని అని ,గత పాలకులు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని దాని పర్యవసానమే ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో 217 ఇందిరమ్మ ఇండ్లను అందించిన ఘనత తమదేనని 80 శాతం ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని అన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో లేని విధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాలో ప్రజలకు అరుదైన చికిత్సలను అందిస్తూ ఆరు అవార్డులను అందుకుందని తెలిపారు.
భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహోన్నతమైన నిర్ణయం తీసుకొని జూన్ 2 నుండి 59 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సహజ మరణం చెందితే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారనిఇది దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. గతంలో 2001నుండి 2003 వరకు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్నామని ప్రస్తుతం ఎల్‌నీనో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి చేపట్టి, తక్కువ కాల వ్యవధిలో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అధిక పంటలు దిగుబడి అయ్యాయని రైతులు పండించిన ధాన్యాన్ని గింజ కటింగ్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైస్ మిల్లర్లు, సొసైటీ సీఈఓ లతో సమన్వయం చేసి వడ్ల తరలింపును వేగవంతం చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కావడంతో రూ.16 కోట్ల వ్యయంతో ఎలిగేడు మండలం రెకల్ దేవ్ పల్లి లో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అలాగే ఓదెల, పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో మరో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాంల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. సుల్తానాబాద్ పెద్దపల్లి లో సైతం నిర్మాణం చేపడతామని అన్నారు. రాబోయే రెండేళ్లలో నియోజకవర్గంలో మొత్తం 1.70 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాంలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. కోల్డ్ స్టోరేజ్‌లను సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వం 50% సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. పామాయిల్ పంటకు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే పామ్ ఆయిల్ పండించడంలో అగ్రభాగాన నిలిచిందని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ పూర్తిగా నీటి నిల్వలతో నిండుందని ఐదు రోజులు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపామని పేర్కొన్నారు. కూనారంలో హుసేనియా వాగులో నీరు పారుతుందని అన్నారు. మానేరు వాగులో సైతం నీరు పాయగా ప్రవహిస్తుందని పేర్కొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆరు అవార్డులు రావడం జిల్లాకు గర్వకారణమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు వరి సాగును తగ్గించి మిర్చి, కందులు, పెసర్లు వంటి వాణిజ్య పంటల సాగు పెంచాలని సూచించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు నశించి భూసారం దెబ్బతింటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వరికొయ్యలను కాల్చరాదని హెచ్చరించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు.ట్రాన్స్‌కో ఏ ఈ కిషోర్ మాట్లాడుతూ వర్షాకాలంలో తడిసిన విద్యుత్ స్తంభాలు, తీగలను తాకరాదని సూచించారు. రైతులు పొలాల్లో ప్లాస్టిక్ స్టార్టర్ బాక్సులను వినియోగించాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన విద్యుత్ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని, ఎవరికి డబ్బులు చెల్లించవద్దని వివరించారు. విద్యుత్ సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.బస్తీ దవాఖాన వైద్యురాలు డాక్టర్ సింధూజ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండు రోజులకుపైగా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఉద్యానవన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ రైతులు మట్టి పరీక్షలు చేయించుకుని, శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువుల వినియోగం చేపట్టాలని సూచించారు. వరికొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గి దిగుబడులు దెబ్బతింటాయని తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బిరుదు రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు మున్సిపల్ పరిధిలో ఏ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పాలకవర్గంతో సమీక్షిస్తూ పరిష్కార దిశగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, తాసిల్దార్ బషీరొద్దిన్, కమిషనర్ టి. రమేష్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డి ఏ ఓ శ్రీనివాస్, ఏఓ పైడితల్లి,మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ వార్డుల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






