ప్రాణహితను పక్కనెందుకు పెట్టారు?
భారీ ఖర్చుతో కాళేశ్వరం ఎందుకు కట్టారు?
- మూడు నెలల వరద కోసం వేలకోట్ల ఖర్చు అవసరమా?
- గ్రావిటీ ప్రాజెక్టును వదిలి ఎత్తిపోతల కాళేశ్వరం దేనికి?
- ఎత్తిపోసిన నీళ్లను మళ్లీ గ్రావిటీ వద్దకే తేవటం ఎందుకు?
- నీటిపారుదల ఇంజినీర్లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నలు
* అసలు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? ఏయే అంశాల్లో ఆ ప్రాజెక్టు వయబుల్ కాదని నిర్ధారణకు వచ్చారు? అందుకు ఏయే నివేదికలను పరిశీలించారు?
జస్టిస్ పీసీ ఘోష్
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): గోదావరిలో మూడు నెలల పాటు వచ్చే వరదను ఎత్తిపోయడానికి వేలకోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకంటే ముందే ప్రణాళికలు వేసిన ప్రాణహిత ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని నిలదీసింది.
గ్రావిటీ ఉన్న దగ్గర ప్రాజెక్టును నిర్మించకుండా వేరే చోట భారీగా నిర్మించి.. మళ్లీ గ్రావిటీ ఉన్న దగ్గరికి నీటిని ఎందుకు ఎత్తిపోయాల్సి వచ్చింది? ఇందులో ఆంతర్యం ఏమిటి? ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్, ఓ అండ్ ఎం) కార్యాలయాలకు సంబంధించిన ఇంజినీర్లను శుక్రవారం ప్రశ్నించింది. ఇద్దరు ఈఎన్సీ కార్యాలయాల్లోని ఇద్దరు ఇంజినీర్లను కమిషన్ పలు వివరాలు అడిగి తెలుసుకొన్నది.
అసలు ప్రాణహిత ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? ఏయే అంశాల్లో ఆ ప్రాజెక్టు వయబుల్ కాదని నిర్ధారణకు వచ్చారు? అందుకు ఏయే నివేదికలను పరిశీలించారు? అనే కోణంలో ప్రశ్నలను సంధించి సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తున్నది. అనంతరం మీడియాతో మాట్లాడిన పీసీ ఘోష్.. ప్రాణహిత ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించారనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
ప్రాణహిత ప్రాజెక్టుపై గతంలో ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక గురించి కమిషన్ ఇంజినీర్లను ప్రశ్నించినట్టు సమాచారం. రిటైర్డు ఇంజినీర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 2015లో ప్రాణహిత రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను తమకు అందించాలని కమిషన్ ఆదేశించింది. కాగా, జూలై మొదటి వారంలో కమిషన్‌కు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), పుణె సంస్థల నుంచి నివేదికలు అందే అవకాశం ఉంది. ఆ నివేది కలు అందిన తరువాత కమిషన్ విచారణలో మరింత వేగం పెరగనున్నది.






