కాళ్లు మొక్కినా కనికరించలేదు
- నిండు ప్రాణం తీసిన భూవివాదం
- తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
- ఏడుగురిపై కేసు నమోదు
- పోలీసుల అదుపులో నలుగురు
- 100కు డయల్ చేసిన గ్రామస్తులు
- స్పందించని ఎస్సై శ్రీనివాసులు సస్పెండ్
మహబూబ్‌నగర్, జూన్ 14 (విజయక్రాంతి) : భూ వివాదంతో ఓ వ్యక్తి నిండు ప్రాణం పోయిన సంఘటన నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని చిన్నపార్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు చిన్నపొర్ల గ్రామానికి చెందిన ఎర్రగండ్ల లక్ష్మప్పకు బాలమ్మ, బప్పమ్మ ఇద్దరూ భార్యలు. మొదటి భార్య బాలమ్మకు ఎర్రగండ్ల సంజప్ప, రెండవ భార్యకు పెద్ద సారప్ప, చిన్న సారప్ప కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎర్రగండ్ల లక్ష్మప్ప తనకు ఉన్న 9 ఎకరాల వ్యవసాయ భూమిని ఇద్దరి భార్యలకు జన్మించిన ముగ్గురు కుమారులకు సమానంగా పంపిణీ చేశారు. మొదటి భార్య బాలమ్మ కుమారుడి ఎర్రగండ్ల సంజప్ప సంతానం భూ పంపకాలను వ్యతిరేకిస్తున్నారు. కొన్నేండ్లుగా ఈ గొడవలు జరుగుతునే ఉన్నాయి.
ఈ భూ వివాదంపై ఇరువురు కేసులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. గత పది రోజుల క్రితం రెండవ భార్య పెద్ద కుమారుడు పెద్ద సారప్ప కుమారుడు సంజప్ప (28) తమ పొలంలో పంటసాగును అడ్డుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ వివాదం కోర్టులో ఉండడంతో తీర్పు వెలువడేంత వరకు యధావిధిగా ఉండాలని పోలీసులు వారికి సూచించారు. గురువారం రెండవ భార్య కుమారులు పెద్ద సారప్ప, చిన్న సారప్ప చిన్నమ్మ కవితతో పాటు సంజప్ప కుటుంబానికి సంబంధించిన పొలం దున్నేందుకు వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న దాయాదులు గుట్టప్ప, ఆశప్ప, చిన్న వెంకటప్ప, ఆటో సంజీవ్, శ్రీను, కిష్టప్ప, నట్టలప్పతోపాటు తదితరులు పొలం వద్దకు చేరుకుని గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య మాటామటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో సంజీవ్ అనే వ్యక్తిపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడిపోయాడు. చిన్నమ్మ పోలీసులతోపాటు గ్రామస్తులకు సమాచారం అందించారు.
సాయం చేసేందుకుగాను గ్రామస్తులు ఎవరు ముందుకు రాలేదు. ఈ విషయంను మాజీ సర్పంచ్ రవీందరెడ్డికి సమాచారం ఇవ్వటంతో గ్రామ పంచాయాతీ ట్రాక్టర్‌ను పంపించగా గాయపడిన సంజీవ్‌ను గ్రామంలోకి తీసుకువ చ్చారు. 108 వాహనంలో నారాయణపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించి మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ సంజీవ్ మృతి చెందారు. కాళ్ళు మొక్కుతాం వదిలేయండి అంటున్న కనికరించలేదని మృతుడి కుటుం బ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి ఇద్దరు మగపిల్లలు, భార్య ఉన్నారు.
ఎస్సై శ్రీనివాసులు సస్పెండ్
గ్రామంలో గొడవ జరుగుతున్నదని పోలీసులు వెంటనే రావాలని 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఉట్కూర్ ఎస్సై శ్రీనివాసులు త్వరగా స్పందించలేదని విచారించిన ఉన్నత అధికారులు ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసంగాలిస్తున్నారు.






